![Delhi Player Banned By BCCI For Fudging Age - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/3/BCCI.jpg.webp?itok=oT2OZnvO)
న్యూఢిల్లీ: అండర్-19 క్రికెట్ టోర్నమెంట్‌లు ఆడేందుకు వయసు దాచి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)నే తప్పుదారి పట్టించే యత్నం చేసిన ఢిల్లీ క్రికెటర్ ప్రిన్స్ రామ్ నివాస్ యాదవ్‌పై నిషేధం పడింది. ఈ మేరకు రామ్ నివాస్ యాదవ్ దొంగ సర్టిఫికేట్ ఇచ్చాడనే విషయం తాజాగా వెలుగుచూడటంతో అతనిపై నిషేధం విధిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. కాగా, ఈ నిషేధం రెండేళ్ల పాటు మాత్రమే అమల్లో ఉంటుందని బోర్డు తెలిపింది. దాంతో 2020-21, 2021-22 సీజన్‌లలో దేశవాళీ టోర్నీల్లో పాల్గొనే అవకాశాన్ని రామ్ నివాస్ కోల్పోయాడు. ‘ అతను వయసుతో బోర్డును రాష్ట్ర అసోసియేషన్‌ను తప్పుదోవ పట్టించే యత్నం చేశాడు. దీనిపై బీసీసీఐ నుంచి మాకు సమాచారం అందింది. దాంతో అతనిపై విచారణ చేయగా తప్పు చేసినట్లు తేలింది’ అని డీడీసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
అతను 1996, జూన్ 10వ తేదీన పుడితే, బీసీసీఐకి ఇచ్చిన సర్టిఫికేట్‌లో 2001, డిసెంబర్ 12వ తేదీన పుట్టినట్లు ఉంది. ఈ విషయం అతని సెకండరీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్‌లో బట్టబయలు అయ్యింది. ఏకంగా ఐదు ఏళ్ల తేడాతో బోర్డునే బురిడీ కొట్టించాలని చూడటంతో బీసీసీఐ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ క్రికెట్ బోర్డులో అతని ఐడీ నంబర్ 12968 కాగా, ఢిల్లీ తరఫున రిజస్ట్రేష్ చేసుకున్నాడు. 2018-19 సీజన్‌కు సంబంధించి అండర్-19 క్రికెట్ కేటగిరీలో అతను రిజస్టర్ చేసుకున్నాడు. కాగా, అతని వయసుకు సంబంధించి సర్టిఫికేట్‌ను ఇటీవల బీసీసీఐ ఇవ్వాల్సి రావడంతో అసలు దొంగ సర్టిఫికేట్ వ్యవహారం బయటపడింది. అతనికి సంబంధించి పూర్తి వివరాలను బీసీసీఐ.. డీడీసీఏకు అందజేసింది. అందులో అతని జన్మించిన సంవత్సరం 2001గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment