![Delhi Nurse Approached Player To Place Bets During IPL 2020 - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/5/ipl.jpg.webp?itok=2yodG7Ii)
కర్టెసీ: ఐపీఎల్/బీసీసీఐ
న్యూఢిల్లీ: ఎంటర్‌టైన్‌మెంట్ ఈవెంట్‌గా పాపులర్ అయిన క్యాష్ రిచ్ టోర్నీ ఐపీఎల్ అదే స్థాయిలో వివాదాలకు కేంద్రంగా నిలిచింది. కొన్నేళ్ల క్రితం రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లు అజిత్ చండీలా, శ్రీశాంత్, అంకిత్ చవాన్ బెట్టింగ్ ఆరోపణలతో నిషేదానికి గురికాగా, తాజాగా మరోసారి బెట్టింగ్‌కు సంబంధించిన విషయమొకటి వెలుగు చూసింది. ఐపీఎల్‌లో బెట్టింగ్ ఎలా పెట్టాలి? ఏ జట్టుపై డబ్బులు పెడితే బాగుటుంది, అంతర్గతంగా టీమ్ విషయాలు తెలపాలంటూ ఢిల్లీకి చెందిన ఓ నర్స్ ఐపీఎల్ ఆటగాడిని సంప్రదించినట్టు ఓ స్టడీ రిపోర్టు తెలిపింది. ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్ అజిత్ సింగ్ ధ్రువీకరించారు.
ఐపీఎల్ 2020 జరుగుతున్న క్రమంలో ఢిల్లీలో నర్స్‌గా పనిచేస్తున్న ఓ మహిళ బెట్టింగ్ పెట్టేందుకు సహాయం చేయాలని, వివరాలు చెప్పాలని ఒక ఆటగాడిని ఫోన్ ద్వారా సంప్రదించిన మాట వాస్తమేనని అజిత్ సింగ్ అన్నారు. అయితే, ఆ విషయాన్ని సదరు ఆటగాడు తమ దృష్టికి తేగా విచారణ చేపట్టామని ఆయన పేర్కొన్నారు. ఆటగాడికి ఆ నర్స్ ఎవరో, ఎక్కడ ఉంటుందో తెలియదని అన్నారు. అవగాహన లేకే ఆమె అలా ప్రవర్తించిందని, ఆమెకు బెట్టింగ్ ముఠాలతో ఎటువంటి సంబంధం లేదని విచారణలో తేలిందని అజిత్ సింగ్ స్పష్టం చేశారు. దాంతో ఆ విషయాన్ని అక్కడితో వదిలేశామని తెలిపారు. కాగా, ఐపీఎల్ 13వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు దుబాయ్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా ట్రోఫీని చేజిక్కించుకున్న ముంబై ఇండియన్స్, ఐదు సార్లు విజేతగా నిలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది.
(చదవండి: టెస్టు సిరీస్: కేఎల్ రాహుల్ అవుట్)
Comments
Please login to add a commentAdd a comment