మిశ్రాపై విచారణకు ఆదేశించిన బీసీసీఐ
బెంగళూరు: భారత లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా దక్షిణాఫ్రికాతో జరగనున్న నాలుగో వన్డేలో ఆడతాడా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. గత నెలలో ఓ మహిళను దుర్భాషలాడమే కాకుండా దాడి చేసిన ఘటనలో మిశ్రాపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మిశ్రాకు నోటీసులు జారీ చేశారు. ఎఫ్ఐఆర్ కాపీని బీసీసీఐకి బెంగళూరు సెంట్రల్ డివిజన్ డీసీపీ సందీప్ పంపించినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన బీసీసీఐ.. బౌలర్ మిశ్రాపై విచారణకు బుధవారం ఆదేశించింది.
దీంతో టీమిండియా-దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న గాంధీ-మండేలా సిరీస్లో గురువారం జరగనున్న నాల్గో వన్డేలో మిశ్రా ఆడుతాడా లేదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. కాగా, బాధిత మహిళ నుంచి ఫిర్యాదు స్వీకరించిన బెంగళూరు పోలీసులు అతడిపై ఐపీసీ సెక్షన్లు 354, 328 కింద మిశ్రాపై కేసు నమోదు చేసిన విషయం విదితమే.