ముంబై : మమ్మల్నే బ్లాక్ మెయిల్ చేస్తారా? అంటూ క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)పై భారత క్రికెట్ నియంత్రణ మండలి( బీసీసీఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. మే 6 నుంచి జరగబోయే మహిళ ఐపీఎల్‌కు తమ ఆటగాళ్లను పంపించకుండా సీఏ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడింది. తమ మహిళా క్రికెటర్లను పంపించాలంటే ఎఫ్‌టీపీ (ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాం) వివాదం తేల్చాలని మెలిక పెట్టింది.
వచ్చే ఏడాది జనవరిలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత్‌లో ఆస్ట్రేలియా పురుషుల జట్టు పర్యటించాల్సి ఉంది. అయితే, దీనిని వాయిదా వేయాలని భావించింది. దీనికి బీసీసీఐ ససేమిరా అనడంతో.. మహిళా ఐపీఎల్‌కు తమ ఆటగాళ్లను పంపకుండా బీసీసీఐపై ఒత్తిడి పెంచాలనే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిణి బెలిందా క్లార్క్ బీసీసీఐకి ఈమెయిల్ పంపారు. 2020లో భారత్‌తో ఆడాల్సిన సిరీస్‌పై ఉన్న వివాదం పరిష్కారమైతే తప్ప మహిళా ఐపీఎల్‌కు తమ ఆటగాళ్లను పంపడం సాధ్యం కాదన్నారు.
సీఏ ఈమెయిల్‌పై స్పందించిన బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. మెన్స్ క్రికెట్‌కు మహిళా ఐపీఎల్‌కు ముడిపెట్టడం ఏమిటని ప్రశ్నించింది. బెలిందా ఈమెయిల్ చూస్తేంటే తమను బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్టుగా అనిపిస్తోందని మండిపడింది భవిష్యత్తు పర్యటన ప్రణాళిక (ఎఫ్‌టీపీ) ప్రకారం ఆసీస్‌తో సిరీస్ జరగాల్సి ఉందని, ఇప్పుడు వెనకడుగు వేయడం ఏమిటని నిలదీసింది. వచ్చే నెల 6 నుంచి 11 వరకు జైపూర్ వేదికగా జరగనున్న మహిళల ఐపీఎల్‌లో ఆసీస్ మహిళా క్రికెటర్లు లానింగ్, ఎలిస్ పెర్రీ, అలిసీ హీలీలు ఆడాల్సి ఉండగా, వారిని భారత్ పంపాల్సిందిగా బీసీసీఐ కోరడంతో సీఏ ఇలా బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడింది.
Comments
Please login to add a commentAdd a comment