BCCI Announces Successful Bidders For Womens IPL, Know Details - Sakshi
Sakshi News home page

మహిళల ఐపీఎల్‌ కీలక అప్‌డేట్స్‌.. లీగ్‌ పేరు, ఏ ఫ్రాంచైజీని ఎవరు కొన్నారు..?

Published Wed, Jan 25 2023 4:31 PM | Last Updated on Thu, Jan 26 2023 5:05 AM

BCCI Announces Bidders For Womens IPL - Sakshi

మహిళల క్రికెట్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయం. మన దేశంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన లీగ్‌ పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు తొలి అంకం పూర్తయింది. అదీ అలాంటి ఇలాంటి తరహాలో కాదు. బీసీసీఐకి కాసుల వర్షం కురిపించేలా, అతివల ఆటను అందలం ఎక్కించేలా లీగ్‌ దూసుకొచ్చింది. అనూహ్య రీతిలో ఐదు జట్లను ఏకంగా రూ. 4669.99 కోట్లకు అమ్మిన బోర్డు తమ ఖజానాను మరింత పటిష్టం చేసుకోగా... ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా క్రికెటర్లు బంగారు భవిష్యత్తును ఆశించేలా ఉన్న లీగ్‌ విలువ కొత్త ఆశలు రేపింది. పురుషుల లీగ్‌తో పోలిస్తే ‘ఇండియన్‌’ లేకుండా ‘ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌’ అనే కొత్త పేరుతో లీగ్‌ జరగనుంది. ఇక మిగిలింది వేలం ద్వారా ప్లేయర్ల ఎంపిక... ఆపై తొలి టోర్నీ సమరానికి సర్వం సిద్ధం!   

ముంబై: దాదాపు ఐదున్నరేళ్ల క్రితం వన్డే వరల్డ్‌ కప్‌లో ఫైనల్‌ చేరిన నాటినుంచి అంతకంతకూ తమ స్థాయిని పెంచుకుంటూ వచ్చిన భారత మహిళల క్రికెట్‌లో ఇదే మేలిమలుపు... పురుషుల ఐపీఎల్‌ తరహాలోనే తమకంటూ ఒక లీగ్‌ ఉండాలంటూ కోరుకుంటూ వచ్చిన మహిళల స్వప్నం భారీ స్థాయిలో సాకారం కానుంది. ఐపీఎల్‌ తరహాలో నిర్వహించే తొలి లీగ్‌ కోసం జట్లను సొంతం చేసుకునేందుకు బీసీసీఐ నిర్వహించిన వేలం అద్భుతం చేసింది. మొత్తం రూ. 4666.99 కోట్లకు ఐదు టీమ్‌లను వేర్వేరు సంస్థలు సొంతం చేసుకున్నాయి. లీగ్‌కు ‘హోం గ్రౌండ్‌’లుగా నిలిచే ఐదు నగరాలుగా అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ, లక్నో ఖరారయ్యాయి. ఇందులో అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీ కోసం అదానీ సంస్థ అత్యధికంగా రూ. 1289 కోట్లు వెచ్చించింది. మూడు పురుషుల ఐపీఎల్‌ టీమ్‌ యాజమాన్యాలు ముంబై, బెంగళూరు, ఢిల్లీ ఇక్కడా భారీ మొత్తాలను మహిళల టీమ్‌లను సొంతం చేసుకోగా... ఐదో జట్టును క్యాప్రి గ్లోబల్‌ హోల్డింగ్స్‌ సంస్థ గెలుచుకుంది.  

భారీ డిమాండ్‌తో...
మహిళల లీగ్‌ జట్లను సొంతం చేసుకునేందుకు 17 సంస్థలు బిడ్‌లను కొనుగోలు చేసి పోటీ పడ్డాయి. 2008లో తొలిసారి పురుషుల ఐపీఎల్‌ ప్రకటించినప్పుడు జట్ల కొనుగోలుకు సంబంధించి బీసీసీఐ కనీస విలువను నిర్ణయించింది. ఈసారి అలాంటిది లేకుండా ఆసక్తి ఉన్నవారు తాము అనుకున్న మొత్తానికి బిడ్‌లు వేశారు. ఇటీవలే మహిళల లీగ్‌ ప్రసార హక్కులను రూ. 951 కోట్లకు వయాకామ్‌ 18 గ్రూప్‌ సొంతం చేసుకోవడం మహిళల మ్యాచ్‌లకూ పెరిగిన ఆదరణను చూపించింది. దాంతో ఫ్రాంచైజీలపై కూడా ఆసక్తి నెలకొంది. నిబంధనల ప్రకారం లీగ్‌ ప్రసార హక్కుల్లో 80 శాతం మొత్తాన్ని ఐదేళ్ల పాటు ఐదు ఫ్రాంచైజీలకు పంచుతారు. అందువల్ల కూడా ఎలా చూసినా నష్టం లేదని భావన బిడ్లర్లలో కనిపించింది. పురుషుల లీగ్‌లో టీమ్‌ను దక్కించుకోవడంలో విఫలమైన అదానీ గ్రూప్‌ ఈసారి మహిళల క్రికెట్‌లో అడుగు పెట్టగా, గుజరాత్‌ టైటాన్స్‌ స్పాన్సర్లలో ఒకటైన క్యాప్రి గ్రూప్‌ కూడా టీమ్‌ను సొంతం చేసుకుంది. 2008లో తొలిసారి పురుషుల ఐపీఎల్‌లో ఎనిమిది జట్లకు కలిపి రూ. 28,943.6 కోట్లు (అప్పటి డాలర్‌ విలువ ప్రకారం) బోర్డు ఖాతాలో చేరాయి. ఇప్పుడు మారిన విలువ ప్రకారం చూసినా మహిళల లీగ్‌లో వచ్చిన మొత్తం చాలా ఎక్కువని, నాటి రికార్డు బద్దలైందని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు.  

మార్చిలో టోర్నీ...
డబ్ల్యూపీఎల్‌ నిర్వహణకు సంబంధించిన తేదీల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఫిబ్రవరి 26న దక్షిణాఫ్రికాలో మహిళల టి20 వరల్డ్‌కప్‌ ముగిసిన వెంటనే సాధ్యమైంత తొందరగా మ్యాచ్‌లు జరిపే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో దీనికి సంబంధించి వేలం నిర్వహిస్తారు. ఒక్కో జట్టుకు ప్లేయర్ల కోసం గరిష్టంగా రూ. 12 కోట్లు ఖర్చు చేయవచ్చు. కనీసం 15 మందిని, గరిష్టంగా 18 మందిని టీమ్‌లోకి తీసుకోవచ్చు. ఇందులో ఐదుగురు విదేశీ ప్లేయర్లు ఉంటారు. తొలి సీజన్‌లో మొత్తం 22 మ్యాచ్‌లు జరుగుతాయి. మహిళల క్రికెట్‌లో ఈ రోజునుంచి కొత్త ప్రయాణం మొదలైందంటూ వ్యాఖ్యానించిన బోర్డు కార్యదర్శి జై షా కొత్త లీగ్‌కు ‘మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)గా నామకరణం చేసినట్లు వెల్లడించారు. ‘ఉమెన్‌ బిగ్‌బాష్‌ లీగ్‌’ తరహాలో ‘ఉమెన్‌ ఐపీఎల్‌’ అంటూ ఇప్పటి వరకు ప్రచారంలో ఉండగా... డబ్ల్యూఐపీఎల్‌ అని కాకుండా కాస్త భిన్నంగానే పేరును ‘డబ్ల్యూపీఎల్‌’కే బోర్డు పరిమితం చేసింది.

వివరాలు ఇలా ఉన్నాయి..

1. అదానీ స్పోర్ట్స్‌లైన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (అహ్మదాబాద్‌, 1289 కోట్లు)

2. ఇండియా విన్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ముంబై, 912.99 కోట్లు)

3. రాయల్‌ ఛాలెంజర్స్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బెంగళూరు, 901 కోట్లు)

4. జేఎస్‌డబ్యూ జీఎంఆర్‌ క్రికెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఢిల్లీ, 810 కోట్లు)

5. క్యాప్రీ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (లక్నో, 757 కోట్లు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement