పింక్ పదనిసలు... | BCCI SG Company Has Ordered 72 Pink Balls For Kolkata Test | Sakshi

పింక్ పదనిసలు...

Published Thu, Oct 31 2019 4:14 AM | Last Updated on Thu, Oct 31 2019 4:29 AM

BCCI SG Company Has Ordered 72 Pink Balls For Kolkata Test - Sakshi

భారత క్రికెట్‌ జట్టులో కీలక సభ్యులకు ప్రాక్టీస్‌ లేదు... బంగ్లాదేశ్‌ ఇప్పటి వరకు ఒక్క టెస్టు కూడా ఆడలేదు... తొలి టెస్టు ముగిసిన తర్వాత రెండో టెస్టు కోసం సన్నద్ధమయ్యేందుకు ఉన్న సమయం కూడా చాలా తక్కువ. అయినా సరే మార్పు మంచిదే అంటూ తొలి డే అండ్‌ నైట్‌ టెస్టు మ్యాచ్‌ నిర్వహణకు బీసీసీఐ సిద్ధమైపోయింది. ఎలాగైనా తన హయాంలో ఈ పని పూర్తి చేయాలని భావించిన సౌరవ్‌ గంగూలీ తీసుకొన్న చొరవతో కోల్‌కతా టెస్టుకు గులాబీ హంగులు చేకూరబోతున్నాయి.

అయితే రెగ్యులర్‌ డే టెస్టు మ్యాచ్‌కు భిన్నం కాబట్టి సహజంగానే నిర్వహణలో కొత్త సమస్యలు కూడా ఖాయం. బంతి మన్నిక మొదలు పిచ్, అవుట్‌ ఫీల్డ్, వాతావరణం, లైటింగ్‌... ఇలా అన్నీ మ్యాచ్‌పై ప్రభావం చూపిస్తాయి. టీమిండియా నవంబర్‌ 22 నుంచి తొలి డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌ ఆడబోతున్న నేపథ్యంలో ‘పింక్‌ టెస్టు’కు ఎదురు కాబోయే సవాళ్లపై ప్రత్యేక కథనం.  

మంచు ప్రభావం
ఇప్పటి వరకు 11 డే అండ్‌ నైట్‌ టెస్టు మ్యాచ్‌లు నిర్వహించినా... అందులో ఒక్కటి కూడా శీతాకాలపు సీజన్‌లో జరగలేదు. 9 మ్యాచ్‌లు వేసవిలో జరగ్గా, మరో 2 మ్యాచ్‌లు అసలు శీతల వాతావరణమే ఉండని దుబాయ్‌లో నిర్వహించారు. భారత్‌లో ఇప్పటి వరకు జరిగిన 12 ఫస్ట్‌క్లాస్‌ డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌లన్నీ పెద్దగా మంచు ప్రభావం కనిపించని ఆగస్టు, సెపె్టంబర్‌లలోనే నిర్వహించారు. నవంబర్‌ నెలలో భారత్‌లో మ్యాచ్‌లు అంటే రాత్రి పూట ఎప్పుడైనా మంచు ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. బంతిపై బౌలర్లకు పట్టు చిక్కకపోవడం, బ్యాట్స్‌మెన్‌ పని సులువు కావడం వన్డేల్లోనే తరచుగా కనిపించే దృశ్యం.

ఎక్కువ ఓవర్లు వేయాల్సి వచ్చే టెస్టులో బౌలర్లు ఏం చేయగలరనేది పెద్ద సమస్య. అయితే దీనికి తమ వద్ద పరిష్కారం ఉందని గంగూలీ చెబుతున్నాడు. ‘డ్యూ ట్రీట్‌మెంట్‌ స్ప్రే’ను వాడి మంచు ప్రభావం తగ్గిస్తామని, ఎలాంటి ఇబ్బందీ ఉండదని అతను అన్నాడు. సీనియర్‌ పిచ్‌ క్యురేటర్‌ దల్జీత్‌ సింగ్‌ మరో సూచన ఇచ్చాడు. ‘పిచ్‌పై కాస్త ఎక్కువ పచ్చికను ఉంచితే బంతి ఎక్కువగా మన్నుతుంది. అవుట్‌ఫీల్డ్‌పై గడ్డిని తక్కువగా ఉంచితే మంచు ప్రభావం కూడా తగ్గుతుంది’ అని ఆయన అన్నారు. 

మ్యాచ్‌ సమయం....
ప్రస్తుతానికి అధికారికంగా మ్యాచ్‌ నిర్వహణా సమయాన్ని బోర్డు ప్రకటించలేదు. అయితే మంచు ప్రభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటూ మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. అదే జరిగితే మ్యాచ్‌ రాత్రి 8.30 గంటల వరకు సాగుతుంది. అంటే దాదాపు రెండు సెషన్లు డే గానే సాగుతాయి. చివరి సెషన్‌ మాత్రమే పూర్తిగా ఫ్లడ్‌లైట్ల వెలుగులో జరుగుతుంది. కానీ అలాంటప్పుడు డే అండ్‌ నైట్‌ టెస్టు ఉద్దేశం నెరవేరదు. ప్రేక్షకులకు డే అండ్‌ నైట్‌ టెస్టు అనుభూతి దక్కాలంటే  ఐపీఎల్‌ మ్యాచ్‌ ముగిసే సమయానికే (దాదాపు రా.11 గంటలు) టెస్టు కూడా ముగిసే విధంగా సమయం నిర్ధారిస్తే బాగుంటుందనేది సూచన.  

ఆటగాళ్ల అనుభవం...
ప్రస్తుత భారత టెస్టు జట్టు సభ్యుల్లో పుజారా, మయాంక్, రిషభ్‌ పంత్, కుల్దీప్‌లకు దులీప్‌ ట్రోఫీలో గులాబీ బంతితో డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌ ఆడిన అనుభవం ఉంది. 2016 ఫైనల్లో పుజారా డబుల్‌ సెంచరీ కూడా చేశాడు. షమీ, సాహా ‘క్యాబ్‌’ క్లబ్‌ మ్యాచ్‌లో ఈ బంతితో ఆడారు. మిగతా ఆటగాళ్లందరికీ పింక్‌ బాల్‌ పూర్తిగా కొత్త. బంగ్లాదేశ్‌లోనైతే ఒకే ఒక్క ఫస్ట్‌ క్లాస్‌ డే అండ్‌ నైట్‌ జరిగింది. అందులో ప్రధాన ఆటగాళ్లెవరూ లేరు. కాబట్టి అనుభవంపరంగా చూస్తే భారత్‌దే పైచేయిగా చెప్పవచ్చు. 

72 బంతులకు ఆర్డర్‌...
కోల్‌కతా టెస్టు కోసం బీసీసీఐ ఎస్‌జీ కంపెనీకి 72  గులాబీ బంతుల కోసం ఆర్డర్‌ ఇచ్చింది. కొన్నాళ్లుగా ఎస్‌జీ ఎరుపు బంతుల విషయంలోనే భారత క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో మరింత నాణ్యతతో పింక్‌ బంతులను తయారు చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఎరుపు బంతితో పోలిస్తే గులాబీ బంతులకు తొందరగా దుమ్ము అంటుకుంటుంది. వేగంగా రంగు వెలసిపోయి నల్లగా మారిపోతున్నాయనేది ప్రధాన ఫిర్యాదు. దీనిని సరిదిద్దుతూ మంచి బంతులు అందిస్తామని ఎస్‌జీ చెబుతోంది. మొత్తంగా ఎరుపు, పింక్‌ మధ్య పెద్దగా తేడా ఏమీ ఉండదు. ఎరుపు బంతిపై సీమ్‌ తెలుపు రంగులో ఉంటే పింక్‌ బాల్‌పై బాగా కనిపించేందుకు నలుపు సీమ్‌ వాడతారు. పింక్‌ బంతి కళ కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి దానిపై గ్రీజ్‌ కూడా పూయరు.

పింక్‌ బంతుల నాణ్యత...
ఎస్‌జీ పింక్‌ బంతులతో జరగబోతున్న మొదటి టెస్టు మ్యాచ్‌ ఇది. గతంలో దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌ల సమయంలో ఆటగాళ్లు బంతులపై కొంత అసంతృప్తిని ప్రదర్శించారు. అప్పుడు కూకాబుర్రా బంతులు వాడారు. మ్యాచ్‌ ప్రారంభమైనప్పుడు, ఫ్లడ్‌లైట్లు వేసినప్పుడు ఇబ్బంది లేకున్నా ఈ రెండింటి మధ్య (దాదాపు సూర్యాస్తమయం సమయంలో) బంతి సరిగా కనిపించడం లేదని, నారింజ రంగులో ఉంటోందని బ్యాట్స్‌మెన్‌ ఫిర్యాదు చేశారు. 10 ఓవర్లు దాటితే ఏమాత్రం ప్రభావం చూపడం లేదని పేసర్లు చెప్పగా, బంతి అసలు టర్న్‌ కావడం లేదని స్పిన్నర్లు మొరపెట్టుకున్నారు. రివర్స్‌ స్వింగ్‌ అయితే ఏమాత్రం పని చేయలేదు. ఇప్పుడు ఎస్‌జీ బంతులకు బోర్డు ఏమైనా ప్రత్యేక సూచనలు చేసి బంతులు తయారు చేయించిందా చూడాలి. 

ప్రేక్షకుల ఆదరణ పెరుగుతుందా!
ఫ్లడ్‌లైట్లలో ఆడించగానే టెస్టులకు జనం పోటెత్తుతారా అనేది సందేహమే. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి పేలవ స్పందన లభించింది. దాంతో కోహ్లి కూడా కొంత అసహనానికి గురై చాలా ఏళ్లుగా టెస్టు క్రికెట్‌ను ఆదరిస్తున్న ఐదు ప్రధాన వేదికలకే మ్యాచ్‌లను పరిమితం చేయాలని సూచించాడు. స్టేడియాలు దూరంగా ఉండటం, సౌకర్యాలు లేకపోవడం కూడా దీనికి కారణం కాగా... గంగూలీ మాత్రం విభేదిస్తూ ఐపీఎల్‌ మ్యాచ్‌లకు రావడం లేదా అని ప్రశి్నంచాడు.

డే అండ్‌ నైట్‌ టెస్టులకు ఆకర్షణ ఉంటుందని మొదటి నుంచి చెబుతూ వచ్చిన అతను కోల్‌కతా పింక్‌ టెస్టు కోసం కోహ్లిని కూడా ఒప్పించాడు. అయితే ఈడెన్‌ గార్డెన్స్‌లో మొదటి నుంచి టెస్టులకు మంచి ఆదరణే దక్కుతోంది. ఇప్పుడు పింక్‌ టెస్టుకు ఇంకా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు రావడంలో ఆశ్చర్యం లేదు. కాబట్టి దీనిని టెస్టుల మనుగడకు ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా కారణం చేత అనుకున్న స్థాయిలో జనాలు రాలేదూ అంటే ఇక మన దేశంలో టెస్టులకు రోజులు దగ్గర పడినట్లే అనుకోవాలి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement