బీసీసీఐపై సుప్రీం కోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: జస్టిస్ ఆర్‌ఎం లోధా ప్రతిపాదనలను అమలు చేయకుండా బీసీసీఐ ధిక్కారణ ధోరణితో వ్యవహరిస్తోందని సుప్రీం కోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం సుప్రీం కోర్టు ఈ కేసును విచారించింది. ఈ రోజు తీర్పు వెలువరిస్తుందని భావించినా.. లోధా కమిటీ ప్రతిపాదనలను అమలు చేయడానికి మరికొంత సమయం కావాలని బీసీసీఐ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును కోరారు. సిబల్ విన్నపం మేరకు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ తీర్పును రిజర్వ్లో ఉంచారు. కాగా తీర్పును ఎప్పుడు వెల్లడించేది ప్రకటించలేదు.
బీసీసీఐలో ప్రక్షాళన చేయాలని సూచిస్తూ లోధా కమిటీ పలు సిఫార్సులు చేసిన సంగతి తెలిసిందే. కాగా వీటిని అమలు చేయడానికి బీసీసీఐ వ్యతిరేకిస్తోంది. సుప్రీం కోర్టులో బీసీసీఐ తరఫు న్యాయవాది ఇదే విషయాన్ని వాదించగా, లోధా కమిటీ ప్రతిపాదనలను పూర్తిగా అమలు చేయాల్సిందేనని కోర్టు స్పష్టం చేయడంతో బోర్డు పెద్దలు దిగివచ్చారు.