టీమిండియా పేసర్ మహ్మద్ షమీ
సాక్షి, న్యూఢిల్లీ: టీమిండియా పేసర్ మహ్మద్ షమీ వివాహేతర సంబంధాల కేసు వివాదం అతడి కెరీర్‌ను భారీ దెబ్బ కొట్టేలా కనిపిస్తోంది. వివాహేతర సంబంధాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న షమీ మెడకు అవినీతి, ఫిక్సింగ్ కేసు చుట్టుకుంది. భార్య చేసిన ఆరోపణల్ని విశ్వసించిన బీసీసీఐ బౌలర్ షమీపై విచారణ చేపట్టాలని అవినీతి నిరోధక-భద్రతా విభాగాన్ని (యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ వింగ్)ఆదేశించింది.
తన భర్త షమీ దుబాయ్ వెళ్లి అక్కడ కొందరు వ్యక్తుల నుంచి డబ్బు తీసుకున్నాడని హసీన్ జహాన్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌కు చెందిన మహ్మద్ బాయ్ అనే మధ్యవర్తి ద్వారా పాకిస్తాన్ మహిళ నుంచి తన భర్త షమీ డబ్బులు తీసుకున్నాడని హసీన్ జహాన్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఏసీఎస్‌యూ అధిపతి నీరజ్ కపూర్ షమీ కేసును విచారించి వారం రోజుల్లోగా నివేదిక అందించనున్నట్లు సమాచారం.
మరోవైపు భార్యతో క్రికెటర్ షమీ ఫోన్ సంభాషణను సీఓఏ విన్న తర్వాత షమీపై విచారణ చేపట్టాలని నిర్ణయించుకుంది. పాక్ మహిళ నుంచి మ్యాచ్ ఫిక్సింగ్ కోసం డబ్బులు తీసుకున్నాడా.. లేక ఇతరత్రా విషయాల కోసమా అన్నది తమ విచారణలో తేలనుందని బీసీసీఐ యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ వింగ్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment