బెన్ స్టోక్స్ గుండె పగిలింది!
ఆఖరి ఓవర్.. 6 బంతుల్లో 19 పరుగులు చేయాలి.. అందరిలో ఉత్కంఠ. కానీ ఆ ఉత్కంఠను పటాపంచలు చేస్తూ విండీస్ హిట్టర్ కార్లోస్ బ్రాత్‌వెయిట్ వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టాడు. బ్రాట్‌వెయిట్ సహా వెస్టిండీస్ ఆటగాళ్లంతా మైదానంలో ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు. నృత్యాలు చేశారు. కానీ చివరి ఓవర్ వేసి ఊహించనిరీతిలో ఊచకోత ఎదుర్కొన్న బెన్ స్టోక్స్ మాత్రం షాక్ తిన్నాడు. కన్నీటిపర్యంతమవుతూ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ఆటలో గెలుపోటములు సహజమే అయినా అతడి పరిస్థితి చూసిన వారికి బాధేసింది.
టీ20 వరల్డ్ కప్‌లో అత్యంత మెరుగ్గా బౌలింగ్ చేస్తూ ఇంగ్లండ్ జట్టుకు విజయాలు అందించిన బెన్ స్టోక్ ఫైనల్ లో మాత్రం ఆ మ్యాజిక్ చూపలేకపోయాడు. దీనిపై కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ.. 'ఇది సహజం. అతను పూర్తిగా ఛిన్నాభిన్నమయ్యాడు. ఈ ప్రభావం అతనిపై కొన్ని రోజులు ఉంటుంది. అతడి బాధను మేము కూడా పంచుకుంటున్నాం. అతని ఓదార్చి ఉండవచ్చని మీరు చెప్పవచ్చు. కానీ అది వినే స్థితిలో కూడా అతడు లేడు' అని అన్నాడు.
క్రికెట్ అనేది అత్యంత క్రూరమైన ఆట అని, ఒకానొక దశలో విండీస్ జట్టును కట్టడి చేసినట్టు తాము భావించినప్పటికీ చివరికి వచ్చేసరికి ఊహించనిరీతిలో ఆ జట్టు విజయం సాధించిందని, క్రికెట్‌లో ఏదైనా జరుగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పాడు. ఫైనల్‌లో పరాయజానికి బెన్ స్టోక్‌ను నిందించరాదని, ఫైనల్ వరకు తమ జట్టు వచ్చినందుకు తాను గర్విస్తున్నానని, తన జట్టు ఆటతీరు పట్ల కూడా తనకు గర్వంగా ఉందని చెప్పాడు.