సరిగా ఆడనందుకు భారీ జరిమానా | Bernard Tomic Fined For Lacking Required Professional Standards at Wimbledon | Sakshi
Sakshi News home page

సామర్థ్యం మేరకు ఆడనందుకు భారీ జరిమానా

Published Fri, Jul 5 2019 9:39 AM | Last Updated on Fri, Jul 5 2019 10:03 AM

Bernard Tomic Fined For Lacking Required Professional Standards at Wimbledon - Sakshi

బెర్నార్డ్‌ టామిక్‌

‘ఆడటం బోరింగ్‌ అనిపిస్తోంది’ అంటూ గాయమైనట్లు నాటకం ఆడి

లండన్‌ : వివాదాస్పద ఆస్ట్రేలియా ఆటగాడు బెర్నార్డ్‌ టామిక్‌ మరో సారి వింబుల్డన్‌ నిర్వాహకుల ఆగ్రహానికి గురయ్యాడు. విల్‌ఫ్రెడ్‌ సోంగా (ఫ్రాన్స్‌)తో జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో అతను తన సామర్థ్యానికి తగినట్లుగా ఆడలేదని రిఫరీ భారీ జరిమానా విధించారు. కేవలం 58 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో టామిక్‌ 2–6, 1–6, 4–6 స్కోరుతో ఓటమిపాలయ్యాడు. టామిక్‌కు తొలి రౌండ్‌ ఆడినందుకు వచ్చే ప్రైజ్‌మనీ మొత్తం 45 వేల పౌండ్లను (సుమారు రూ. 39 లక్షలు) జరిమానాగా చెల్లించాలని ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌ ఆదేశించింది.

‘సోంగాతో జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో టామిక్‌ ఆట ప్రొఫెషనల్‌ ప్రమాణాల స్థాయిలో లేదని రిఫరీ అభిప్రాయ పడ్డారు. అందుకే ఈ శిక్ష విధిస్తున్నాం’ అని నిర్వాహకులు ప్రకటించారు. అయితే తాను ఆడగలిగినంత అత్యుత్తమ ప్రదర్శనే ఇచ్చానని, అయినా ఓడిపోయానని టామిక్‌ వివరణ ఇచ్చాడు. టామిక్‌కు ఇలాంటిది కొత్త కాదు. రెండేళ్ల క్రితం వింబుల్డన్‌లోనే జ్వెరేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో ‘ఆడటం బోరింగ్‌ అనిపిస్తోంది’ అంటూ గాయమైనట్లు నాటకం ఆడి ఓడాడు. దీనికిగానూ అతనిపై జరిమానా పడింది. 2011లో వింబుల్డన్‌ క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన సమయంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్‌–20లో ఉన్న టామిక్‌ ప్రస్తుతం 96వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement