విరాట్ కోహ్లి, భువనేశ్వర్ కుమార్ (ఫైల్ ఫొటో)
లండన్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఫామ్‌లో ఉంటే అతన్ని అడ్డుకోవడం ఏ బౌలర్‌కైనా కష్టమే. గత కొన్నేళ్లుగా స్థిరంగా రాణిస్తున్న కోహ్లి ఒక్క ఇంగ్లండ్ గడ్డపై మాత్రమే విఫలమయ్యాడు. 2014 ఇంగ్లండ్ పర్యటనలో ఈ అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్ కన్నా టీమిండియా పేసర్ భువనేశ్వర్, లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రాలు అద్భుతంగా రాణించారు. ఆ పర్యటనలో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 5 మ్యాచ్‌లు ఆడిన భారత్ 3-1 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. ఈ ఐదు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి కేవలం 134 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 13.40 కాగా.. రెండు సార్లు డకౌట్ కూడా అయ్యాడు. ఇక ఇదే సిరీస్‌లో టెయిలండర్‌గా భువనేశ్వర్ అదరగొట్టాడు. 27.44 సగటుతో 247 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. ఇక భువనేశ్వరే కాదు ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన లెగ్‌స్పిన్నర్ అమిత్ మిశ్రా సైతం 153 పరుగులతో కోహ్లి కన్నా అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 38.25 సగటుతో ఓ హాఫ్ సెంచరీ కూడా సాధించాడు. అయితే ఈ సిరీస్ అనంతరం కోహ్లి నేలకు కొట్టిన బంతిలా విజృంభించాడు.
ఆస్ట్రేలియా గడ్డపై వరుస సెంచరీలతో చెలరేగాడు.. ఇప్పటి వరకు ఆసీస్ గడ్డపై మొత్తం 8 మ్యాచ్‌లాడిన కోహ్లి 62 సగటుతో 992 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉండటం విశేషం. అనంతరం దక్షిణాఫ్రికా గడ్డపై 5 మ్యాచుల్లో 55.80 సగటుతో 558 పరుగులు చేశాడు. ఈ పర్యటనలో రెండు సెంచరీలు నమోదు చేశాడు. న్యూజిలాండ్ గడ్డపై రెండు మ్యాచుల్లో ఓ సెంచరీతో 214 పరుగులు చేశాడు. ఇలా అన్ని దేశాల మీద రాణించిన కోహ్లికి ఇంగ్లండ్‌లో విఫలమవ్వడం వెలతిగా మిగిలిపోయింది. తన సారథ్యంలో ఆగస్టు 1 నుంచి ఇంగ్లండ్‌తో ఇంగ్లండ్ గడ్డపై ప్రారంభమయ్యే 5 టెస్టుల సిరీస్‌లో చెలరేగాలని కోహ్లి భావిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment