భువనేశ్వర్కు కొత్త బాధ్యత
సెయింట్ కిట్స్:టీమిండియా ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ సరికొత్త బాధ్యతను అప్పజెప్పింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు 'జరిమానా కమిటీ'కి భువనేశ్వర్ను చైర్మన్గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కొత్త కోచ్ అనిల్ కుంబ్లే భారత క్రికెట్ జట్టుకు కొన్ని నిబంధనలను విధించిన నేపథ్యంలో ఒక కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీకి భువనేశ్వర్ ను చైర్మన్ గా ఎంపిక చేయగా, మరో క్రికెటర్ చటేశ్వర్ పూజారాకు జరిమానాలను వసూలు చేసే బాధ్యతను ఇచ్చారు. మరోవైపు క్రికెటర్ల ఫిర్యాదులను పరిశీలించే బాధ్యత మాత్రం స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్ కు అప్పగించారు.
ఈ మేరకు భువనేశ్వర్ కుమార్ మాట్లాడుతున్నఓ వీడియోను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది. 'ఇప్పుడు జరిమానా కమిటీ ఒకటి ఏర్పాటైంది. ఆ కమిటీ నిన్నటి నుంచి పని ప్రారంభించడం మొదలుపెట్టింది. ఆ కమిటీ చైర్మన్ గా నన్ను నియమించారు. అయితే ఆ కమిటీ ఇంకా ట్రయల్లోనే ఉంది. ఒకవేళ ఎవరైనా క్రికెటర్ సూచించిన నిబంధనల్నిఅతిక్రమిస్తే కనీసం 50 డాలర్లు(దాదాపు రూ. 3,000) చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని కుంబ్లే ద్వారా ఛారిటీకి అందజేస్తాం' అని భువనేశ్వర్ తెలిపాడు.
టీమిండియా ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టిన మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే.. ఆటగాళ్ల ప్రాక్టీస్, శిక్షణతో పాటు క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. బస చేసిన హోటల్ నుంచి టీమ్ బస్ వద్దకు నిర్ణీత సమయంలోపు రావాలని భారత క్రికెటర్లకు సూచించాడు. ఇక విండీస్ పర్యటనలో ప్రతి నాలుగో రోజు ఆటగాళ్లతో అధికారికంగా సమావేశం కావాలని నిర్ణయించాడు. ఆటగాళ్లకు ఏ సమస్యలున్నా, సందేహాలున్నా ఏ సమయంలోనైనా తనతో కలసి మాట్లాడవచ్చని చెప్పాడు.