భువీ బౌలింగ్ కు కివీస్ విలవిల..
కోల్ కతా: న్యూజిలాండ్ తో ఇక్కడి ఈడెన్ గార్డెన్లో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పట్టు బిగించింది. వరుణుడు రెండో రోజు ఆట మధ్యలో ఆటంకం కలిగించక పోయుంటే తొలి ఇన్నింగ్స్ లో కివీస్ ఇప్పటికే ఆలౌటయ్యేది. భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ చాలా రోజుల తర్వాత అద్భుత(5/33) ప్రదర్శన చేశాడు. రెండో రోజు ఆట నిలిపివేసే సమయానికి 34 ఓవర్లాడిన కివీస్ 7 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 239/7తో బ్యాటింగ్ కొనసాగించిన భారత్.. కీపర్ వృద్ధిమాన్ సాహా అజేయ హాఫ్ సెంచరీ(54 నాటౌట్;7 ఫోర్లు, 2 సిక్సర్లు)తో పోరాడే స్కోరు చేయగలిగింది. షమీ(14)ని బౌల్ట్ ఔట్ చేయడంతో 316 పరుగుల వద్ద భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.
తొలి వికెట్ గా కివీస్ ఓపెనర్ లాథమ్(1)ను షమీ ఎల్బీడబ్ల్యూగా వెనక్కిపంపాడు. అక్కడ మొదలు భువీ విజృంభణతో కివీస్ కష్టాలు మొదలయ్యాయి. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ బంతులతో మొదట గప్టిల్(13)ని ఔట్ చేసిన భువీ, ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో మరోసారి మెరిశాడు. ఆ ఓవర్లో నికోల్స్(1)ని క్లీన్ బౌల్డ్ చేశాడు. లైన్ అండ్ లెంగ్త్ బంతులతో భువీ చెలరేగగా, జడేజా(1/17) పొదుపుగా బౌలింగ్ చేస్తూ కివీస్ బ్యాట్స్ మెన్ పై ఒత్తిడి పెంచాడు. స్కోరుబోర్డుకు వేగంగా పరుగులు జోడిస్తున్న రోంచీ(52 బంతుల్లో 35 రన్స్, 5 ఫోర్లు, 1 సిక్స్)ని జడేజా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అయితే వర్షం కారణంగా 24.4 ఓవర్ల వద్ద ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు. అప్పటికి కివీస్ నాలుగు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసి కష్టాల్లో ఉంది.
5 వికెట్లతో అదరగొట్టిన భువీ
వర్షం ఆగడంతో మ్యాచ్ కొనసాగించగా కివీస్ కష్టాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. కెప్టెన్ టేలర్ ను (36)ను భువీ ఓ తెలివైన బంతితో బొల్తాకొట్టించగా, విజయ్ కి క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్ గా పెవిలియన్ చేరాడు. 33వ ఓవర్లో మళ్లీ భువీ మెరిశాడు. ఆ ఓవర్లో తొలి రెండు బంతుల్లో వరుసగా శాంట్నర్(11), హెన్రీ(0)లను ఔట్ చేశాడు. కివీస్ తమ తొలి ఇన్నింగ్స్ లో 34 ఓవర్లు ఆడిన తర్వాత రెండో రోజు ఆట నిలిపివేశారు. వాట్లింగ్(12), పటేల్(5) నాటౌట్ గా క్రీజులో నిలిచారు.