
సాక్షి ప్రతినిధి విజయనగరం: బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్–దక్షిణాఫ్రికా జట్ల మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలాడు. గురువారం జల్లులతో ప్రారంభమైన వర్షం చాలాసేపు పడటంతో తొలి రోజు ఆటను నిర్వాహకులు పూర్తిగా రద్దు చేశారు. విజయనగరం సమీపంలోని డా. పీవీజీ రాజు ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానం వేదికైన ఈ మ్యాచ్‌లో కనీసం టాస్ కూడా పడలేదు. వాతావరణ ప్రభావంతో మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. ఉదయం 8 గంటలకే చేరుకున్న ఇరు జట్ల క్రీడాకారులు చాలాసేపు వేచి చూశారు. చివరకు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత విశాఖపట్నం తిరుగు ప్రయాణమయ్యారు. అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ల ఆటను దగ్గరగా చూసేందుకు వచ్చిన అభిమానులు నిరాశగా వెనుదిరిగారు. అంతకుముందు ఉదయం 9.30 సమయంలో వరుణుడు కాస్త తెరపినివ్వడంతో ఆట ప్రారంభించే యత్నాలు చేశారు. అంతలోనే మళ్లీ వాన మొదలైంది. శుక్రవారం సైతం వర్షం కురిసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment