ముంబై: రెండేళ్ల తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్‌ను కష్టాలు వీడటం లేదు. కావేరీ జల వివాదం కారణంగా తమిళనాడులో నిరసనలు తీవ్ర స్థాయికి చేరడంతో చెన్నై సూపర్‌కింగ్స్ హోం మ్యాచ్‌లను పుణేకు తరలిస్తూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) నిర్ణయం తీసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ కు మిగిలిన ఆరు హోమ్ మ్యాచ్‌లను పుణేలో నిర్వహించాలని భావించింది. అందుకు సంబంధించిన ప్రకటన కూడా బీసీసీఐ ఇటీవల విడుదల చేసింది. అయితే పుణేలో సైతం చెన్నై హోం మ్యాచ్‌లు జరిగే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. నగరంలో నీటి కొరత తీవ్రంగా ఉండటంతో ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహిస్తే.. గ్రౌండ్ నిర్వహణ కోసం నీటిని ఎలా సమకూరుస్తారని బాంబే హైకోర్టు.. మహారాష్ట్ర క్రికెట్ సంఘాన్ని(ఎంసీఏ) ప్రశ్నించింది. ఇదే విషయమై ఎంసీఏకు నోటీసులు జారీ చేసింది.
నీటి కొరతకు సంబంధించి లోక్‌సత్తా మూవ్‌మెంట్ అనే ఎన్జీవో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం 2016లో దాఖలు చేసింది. ‘పవానా నది నుంచి మాత్రమే పుణే నదికి నీరు అందుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో కరవు పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో నీటిని ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం వినియోగిస్తే.. దాని ప్రభావం నీటి సరఫరాపై పడుతుంద’ని లోక్‌సత్తా వాదించింది. నోటీసుల విషయమై ఏప్రిల్ 18లోగా స్పందించాలని హైకోర్టు ఎంసీఏను ఆదేశించింది. దాంతో పుణేలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగడంపై కూడా సందిగ్థత నెలకొంది. చెన్నైలో జలవివాదం, పుణేలో నీటి కొరత కారణంగా రెండేళ్ల నిషేధం తర్వాత ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ హోంమ్యాచ్‌లు మరొకచోటికి తరలిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. ఒకవేళ పుణే నుంచి ఐపీఎల్ మ్యాచ్‌ల వేదికను మారిస్తే మాత్రం అందుకు ఆతిథ్యమిచ్చే నగరాల్లో విశాఖపట్టణం ముందు వరుసలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment