'బౌలర్లు ఒత్తిడి తగ్గిస్తున్నారు'
నాగ్ పూర్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో తమ బౌలర్లు ఒత్తిడి తగ్గిస్తూ బ్యాట్స్ మెన్ లకు తగినంత సహకారం అందిస్తున్న కారణంగానే టీమిండియాకు ఆధిక్యం సాధ్యమైందని ఓపెనర్ మురళీ విజయ్ స్పష్టం చేశాడు. టీమిండియా బౌలర్లు అంచనాలకు తగ్గట్టు రాణించడంతో తమలో నమ్మకాన్ని రెట్టింపు చేస్తుందన్నాడు. 'బౌలర్లు వికెట్లు తీసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచితే బ్యాట్స్ మెన్ ఆడటానికి సులభతరం అవుతుంది. ఏ జట్టులో అయినా బౌలింగ్ లో రాణిస్తే విజయం సాధ్యమవుతుంది. అది మా బౌలర్లు చేస్తున్నారు. అందుకే టెస్టు సిరీస్ లో పైచేయి సాధించాం' అని విజయ్ పేర్కొన్నాడు.
ఫీల్డర్ల కోణంలో చూస్తే తమ జట్ల మధ్య టెస్టు సిరీస్ పిల్లి-ఎలుక ఆటగా ఉందని అభిప్రాయపడ్డాడు. ఇరు జట్లు నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నా బ్యాట్స్ మెన్ పై అధికారం పడుతుందన్నాడు. తొలి టెస్టులో(75,47) మెరుగైన ప్రదర్శనతో విజయ్ ఆకట్టుకుని టీమిండియా గెలుపులో భాగం పంచుకున్నాడు. రెండో టెస్టు వర్షం కారణంగా నాలుగు రోజులు ఆట జరగకపోవడంతో డ్రా ముగిసింది. నవంబర్ 25 నుంచి జరిగే మూడో టెస్టులో భాగంగా భారత్-సఫారీ క్రికెటర్లు నాగ్ పూర్ లో ప్రాక్టీస్ చేసున్నారు.