
మెల్‌బోర్న్ : బాక్సింగ్ డే టెస్టు మొదటి ఇన్నింగ్స్‌ను భారత్ డిక్లేర్ చేసింది. గురువారం రెండో రోజు ఆటలో భాగంగా ఏడు వికెట్ల నష్టానికి 443 పరుగులు చేసిన అనంతరం భారత్ తన తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అటు తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి వికెట్లేమీ కోల్పోకుండా 8 పరుగులు చేసింది. మార్కస్ హారిస్ (5 బ్యాటింగ్), ఆరోన్ ఫించ్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు 215/2 ఓవర్‌నైట్ స్కోరుతో రెండోరోజు ఆట ప్రారంభించిన భారత్ ధాటిగా ఆడింది. ఓవర్‌నైట్ ఆటగాళ్లు కోహ్లి, పుజారాలు బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేయడంతో భారత స్కోరు బోర్డు పరుగులు తీసింది.
కాగా, ఈ జోడి 170 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత కోహ్లి (82; 204 బంతుల్లో 9 ఫోర్లు) మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆపై మరో ఆరు పరుగుల వ్యవధిలో శతకం సాధించిన పుజారా(106; 319 బంతుల్లో 10 ఫోర్లు) నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. ఇది పుజారాకు టెస్టుల్లో 17వ సెంచరీ కాగా, ఆసీస్‌పై నాల్గోది.
ఆ తరుణంలో అజింక్యా రహానే(34), రోహిత్ శర్మ(63 నాటౌట్)ల జోడి నిలకడగా ఆడింది. దాంతో భారత్ స్కోరు మూడొందల మార్కును అవలీలగా చేరింది. ఇక రోహిత్ శర్మ-రిషబ్ పంత్(39)లు జంట కూడా మరో కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో భారత్ నాల్గొందల మార్కును దాటింది. స్కోరును పెంచే క్రమ్లో రిషభ్ పంత్ ఔటైన స్వల్ప వ్యవధిలో రవీంద్ర జడేజా సైతం ఔట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి రోజు ఆటలో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (76) హాఫ్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ మూడు వికెట్లు సాధించగా, మిచెల్ స్టార్క్‌కు రెండు వికెట్లు లభించాయి. హజల్‌వుడ్, లయన్‌లకు తలో వికెట్ దక్కింది.