ఇంతకంటే ఘోరమైన స్థితిలో ఆడాం!
రెండో మ్యాచ్ రద్దుపై ధోని వ్యాఖ్య
లాడర్‌హిల్ (ఫ్లోరిడా): సిరీస్ సమం చేసే అవకాశం ముందుండగా, వర్షం కారణంగా రెండో టి20 మ్యాచ్ రద్దు కావడం భారత కెప్టెన్ ధోనిని అసహనానికి గురి చేసింది. ఆట కొనసాగించి ఉండాల్సిందని అతను అభిప్రాయ పడ్డాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియా సమావేశంలో ముందుగా విండీస్ కెప్టెన్ బ్రాత్‌వైట్ మాట్లాడుతూ ‘పెవిలియన్‌నుంచి చూస్తే రెండు మూడు చోట్ల మైదానం ప్రమాదకరంగా కనిపించింది. ముఖ్యంగా రనప్ ఏరియా వద్ద పరుగెత్తి బౌలింగ్ చేయడం చాలా కష్టం. అవుట్‌ఫీల్డ్‌లో కూడా బంతి కోసం పరుగెత్తి ఆటగాడు జారి పడితే అతని కెరీర్ ముగిసిపోవచ్చు.
అంపైర్లు సరైన నిర్ణయం తీసుకున్నారు‘ అని అన్నాడు. అయితే దీనితో ధోని విభేదించాడు. ‘పదేళ్లుగా ఇంతకంటే ఘోరమైన పరిస్థితుల్లో కూడా మైదానంలోకి దిగి మ్యాచ్‌లు ఆడాం. 2011 ఇంగ్లండ్ సిరీస్ అయితే మొత్తం వర్షంలోనే సాగింది. అయినా నీళ్లు నిలిచిన ప్రాంతం రనప్ ఏరియాకు చాలా దూరం ఉంది. మరీ అంత దూరంనుంచి పరుగెత్తుకు రావడానికి వారి జట్టులో షోయబ్ అక్తర్ లేడు. కాబట్టి అదేమీ పెద్ద సమస్య కాదు. కాకపోతే అంపైర్ల నిర్ణయాన్ని గౌరవించాల్సి వచ్చింది‘ అని అతను వ్యాఖ్యానించాడు. మరో వైపు రాబోయే రోజుల్లో సొంతగడ్డపైనే వరుసగా 13 టెస్టులు ఆడనున్న భారత జట్టు నంబర్‌వన్ ర్యాంక్‌ను కైవసం చేసుకుంటుందని ధోని ఆశాభావం వ్యక్తం చేశాడు.