బ్రెజిల్ అథ్లెట్లకు డోప్ టెస్టులు చేయలేదు!
రియోడీజనీరో: రియో ఒలింపిక్స్ కు నెల రోజుల ముందు నుంచి ఇప్పటివరకూ తమ అథ్లెట్లకు డోపింగ్ టెస్టులు చేయలేదని ఆతిథ్య బ్రెజిల్ అధికారులు షాకింగ్ వార్త తెలిపారు. జూలై 1 - 24 తేదీల మధ్య ఒక్క అథ్లెట్ కు కూడా డోప్ టెస్టులు చేయలేదని వెల్లడించింది. ఈ విషయంపై ఇతర దేశాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి దేశం తమ అథ్లెట్లకు కచ్చితంగా డోపింగ్ టెస్టులు నిర్వహించాలి కానీ రియోకు ఆతిథ్యమిచ్చిన బ్రెజిల్ అలా చేయకపోవడంపై ఇతర దేశాల అథ్లెట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వివాదం అక్కడ చర్చనీయాంశంగా మారింది.
ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ(వాడా) తమ దేశ డోపింగ్ టెస్టింగ్ లాబోరేటరీని మూసివేసిన కారణంగా డోప్ టెస్టులు చేయలేదని బ్రెజిల్ వివరణ ఇచ్చుకుంది. డోపింగ్ టెస్టులు ఎందుకు నిర్వహించలేదో తెలపాలంటూ వాడా డైరెక్టర్ బ్రెజిల్ అధికారులను ప్రశ్నించగా, అసలు విషయాన్ని బయటపెట్టారు. అయితే ఈ వివరణపై వాడా అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ దేశంలోని మరో మూడు ల్యాబ్ లకు శాంపిల్స్ పంపించినా, అక్కడ పరికరాలు లేనందున టెస్టులకు వీలుకాలేదని బ్రెజిల్ చెబుతోంది. జూన్ 22న బ్రెజిల్ లాబోరేటరీపై విధించిన నిషేధాన్ని జూలై 20న ఎత్తివేసిన విషయం తెలిసిందే.