పరువు కోసం ఆఖరి పోరు... | Brazil vs Netherlands match starts To day | Sakshi
Sakshi News home page

పరువు కోసం ఆఖరి పోరు...

Published Sat, Jul 12 2014 1:06 AM | Last Updated on Mon, Oct 22 2018 5:58 PM

పరువు కోసం ఆఖరి పోరు... - Sakshi

పరువు కోసం ఆఖరి పోరు...

నెదర్లాండ్స్‌తో బ్రెజిల్ ఢీ
 గెలిస్తే ఆతిథ్య జట్టుకు కాస్త ఊరట
 ఓడితే మరింత డీలా
 చరిత్ర యూరోప్ జట్లకే అనుకూలం
 
 అర్ధరాత్రి గం. 1.30 నుంచి
 సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
 
 బ్రెసిలియా: పోయిన పరువును రాబట్టుకోవడానికి... నిస్తేజంగా ఉన్న అభిమానుల్లో మళ్లీ మంచి ‘మూడ్’ తీసుకురావడానికి... భవిష్యత్ కోసం బాటలు పరచడానికి... ఆతిథ్య జట్టు బ్రెజిల్ ముంగిట చివరి అవకాశం మిగిలింది. శనివారం నెదర్లాండ్స్‌తో జరిగే ‘ప్లే ఆఫ్’ మ్యాచ్‌లో గెలిస్తే బ్రెజిల్‌కు సొంతగడ్డపై మెగా ఈవెంట్‌ను విజయంతో ముగించామన్న కాస్త సంతృప్తి కలుగుతుంది.
 
 ఒకవేళ ఓడితే మాత్రం బ్రెజిల్  ఫుట్‌బాల్‌కు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. మొత్తానికి ఆతిథ్య జట్టు మరో అగ్నిపరీక్షకు సిద్ధమైంది. ఇప్పటివరకు ప్రపంచకప్ చరిత్రలో మూడుసార్లు మూడో స్థానం కోసం ఆడిన బ్రెజిల్ రెండుసార్లు (1938లో, 1978లో) గెలిచి, ఒకసారి (1974లో) ఓడిపోయింది. మరోవైపు నెదర్లాండ్స్ ‘మూడో స్థానం’ కోసం రెండోసారి బరిలోకి దిగుతోంది. 1998లో తొలిసారి ‘ప్లే ఆఫ్’ మ్యాచ్‌లో ఆడిన నెదర్లాండ్స్ 1-2తో క్రొయేషియా చేతిలో ఓడిపోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. గణాంకాలను పరిశీలిస్తే... గత ఎనిమిది ప్రపంచకప్‌లలో  మూడో స్థానం యూరోప్ దేశానికే దక్కింది. ఈ నేపథ్యంలో చరిత్ర నెదర్లాండ్స్‌కే అనుకూలంగా ఉంది.
 
 అర్థం లేని మ్యాచ్: డచ్ కోచ్
 ‘మూడో స్థానం మ్యాచ్ అనేది అర్థంలేనిది. గత 15 సంవత్సరాలుగా ఈ మాట చెబుతున్నాను. ఎందుకంటే బాగా ఆడుతోన్న జట్టుకు వరుసగా రెండు పరాజయాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఓటమితో టోర్నీని ముగించామన్న అప్రతిష్ట వస్తుంది’ అని నెదర్లాండ్స్ కోచ్ లూయిస్ వాన్ గాల్ చేసిన వ్యాఖ్యలు ఆ జట్టు ‘ప్లే ఆఫ్’ మ్యాచ్‌పై ఎంత అయోమయంగా ఉందో ఊహించుకోవచ్చు. మరోవైపు బ్రెజిల్  ఈ మ్యాచ్ గెలవాలంటూ సహచరుల్లో నెయ్‌మార్ స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు. ‘సెమీఫైనల్లో ఓడినతీరు నమ్మశక్యంగా లేదు. చరిత్రలో సువర్ణాక్షరాలతో పేర్లను లిఖించుకునేందుకు లభించిన అవకాశాన్ని వృథా చేసుకున్నాం. అయితేనేం మూడో స్థానం మ్యాచ్‌ను ఫైనల్‌గా భావించి విజయంతో టోర్నీని ముగించాలి. ఈ గెలుపు.. బాధను తగ్గించకపోవచ్చు.
 
 అయితే విజయం సాధించడం అత్యంత ముఖ్యం’ అని  నెయ్‌మార్ జట్టు శిబిరానికి హాజరై సహచరులకు చెప్పిన మాటలు చూస్తుంటే ఆతిథ్య జట్టుకు ఆ మ్యాచ్ ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. సొంతగడ్డపై విశ్వవిజేతగా అవతరించాలని బ్రెజిల్... అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచకప్‌ను ఈసారైనా సొంతం చేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఈ మెగా ఈవెంట్‌లో అడుగుపెట్టిన నెదర్లాండ్స్ తమ లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్లు కనీసం టోర్నీని విజయంతోనైనా ముగించాలనే భావనతో ఉన్నాయి.
 
 ఒక మ్యాచ్ సస్పెన్షన్ ముగియడంతో ‘ప్లే ఆఫ్’కు కెప్టెన్ థియాగో సిల్వా అందుబాటులోకి రానుండటంతో బ్రెజిల్ రక్షణపంక్తి బలోపేతం కానుంది. బ్రెజిల్ కోచ్‌గా చివరిసారి బరిలోకి దిగనున్న లూయిజ్ ఫెలిప్ స్కొలారీ ప్రయోగాలకు పెద్దపీట వేసే అవకాశముంది.
 
 ఒక్క మ్యాచ్‌లోనూ అవకాశంరాని మాక్స్‌వెల్‌ను ఆడించే చాన్స్ ఉంది. ఫార్వర్డ్స్ లూయిజ్, ఆస్కార్, డానియెల్ అల్వెస్, ఫెర్నాన్‌డినో రాణించడంపై బ్రెజిల్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ‘జీవితం ముందుకుసాగిపోతుంది. తదుపరి లక్ష్యంపై మనం దృష్టిసారించాలి. మా తర్వాతి లక్ష్యం ప్లే ఆఫ్ మ్యాచ్‌లో నెగ్గి మూడో స్థానం సంపాదించడం’ అని కోచ్ స్కొలారీ తన ఉద్దేశాన్ని స్పష్టంచేశారు.
 
 సెమీఫైనల్లో ‘షూటౌట్’లో ఓడిపోవడం మినహా... నెదర్లాండ్స్ ఈ టోర్నీలో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో గెలిచింది. అదే జోరును ‘ప్లే ఆఫ్’లోనూ కొనసాగించి తొలిసారి ‘మూడో స్థానం’ పొందామన్న సంతృప్తితో తిరుగుముఖం పట్టాలనే తపనతో ఉంది. 23 మంది సభ్యులతో కూడిన నెదర్లాండ్స్ జట్టులో 22 మంది ఏదో ఒక మ్యాచ్‌లో కొన్ని నిమిషాలైనా ఆడారు. ఈ అవకాశం దక్కని మూడో గోల్‌కీపర్ మైకేల్ వోర్న్‌ను కోచ్ వాన్ గాల్ ఈ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఆడించే అవకాశం ఉంది. అర్జెన్ రాబెన్, రాబిన్ వాన్ పెర్సీ, వెస్లీ స్నైడెర్, డిర్క్ క్యుట్, హంటెలార్, మెంఫిస్ మరోసారి చెలరేగితే నెదర్లాండ్స్‌కు మూడో స్థానం దక్కడం ఖాయమనుకోవాలి.
 
 ముఖాముఖిగా బ్రెజిల్, నెదర్లాండ్స్ 11 సార్లు తలపడ్డాయి. రెండు జట్లు మూడేసి మ్యాచ్‌ల్లో నెగ్గాయి. మిగతా ఐదు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. ప్రపంచకప్‌లో మాత్రం ఈ రెండు జట్లు నాలుగుసార్లు పోటీపడ్డాయి. రెండు జట్లు రెండేసి మ్యాచ్‌ల్లో నెగ్గాయి. చివరిసారి 2010 ప్రపంచకప్‌లో బ్రెజిల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ 2-1తో గెలిచింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement