ఐసీసీపై మెకల్లమ్ ధ్వజం!
లార్డ్స్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) అవినీతి నిరోధక శాఖపై న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ మండిపడ్డాడు. క్రికెట్లో అవినీతికి పాల్పడిన కొంతమంది ఆటగాళ్లకు వరల్డ్ క్రికెట్ గవర్నింగ్ బాడీ జీవిత కాలం నిషేధం విధిస్తున్నా, మరికొంతమందిని ప్రత్యేకం ఫిక్సింగ్ చేయమని ప్రోత్సహిస్తున్నట్లు ఉందని విమర్శించాడు. సోమవారం ఎంసీసీ నిర్వహించిన స్పిరిట్ ఆఫ్ క్రికెట్ కార్యక్రమానికి హాజరైన మెకల్లమ్.. తాను గతంలో సహచర ఆటగాడు క్రిస్ కెయిన్స్పై చేసిన ఫిక్సింగ్ ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నాడు.
ప్రస్తుతం ఉన్న ఐసీసీ అవినీతి నిరోధక శాఖలో లోపాల కారణంగానే కొంతమంది ఫిక్సింగ్ నుంచి తప్పించుకుంటున్నారని ఆరోపించాడు. తన తోటి ఆటగాడైన లూ విన్సెంట్కు జీవిత కాలం నిషేధం విధించిన సంగతిని ఈ సందర్భంగా మెకల్లమ్ ప్రశ్నించాడు. విన్సెంట్ లాంటి వారిపై నిషేధం విధించి, కొంతమందిని కాపాడటమా అవినీతి నిరోధక శాఖ విధి అని నిలదీశాడు. ఇక భవిష్యత్తులో్నైనా అవినీతి నిరోధక శాఖ పారదర్శకంగా ఉండాలని మెకల్లమ్ సూచించాడు. అప్పుడే క్రికెట్ లో పూర్తిస్థాయిలో అవినీతిని అరికట్టే అవకాశం ఉందని మెకల్లమ్ పేర్కొన్నాడు.
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో రెండేళ్లుగా కోర్టుల చుట్టూ తిరిగిన న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ క్రిస్ కెయిన్స్‌కు గతేడాది ఊరట లభించిన సంగతి తెలిసిందే. అతణ్ని నిర్దోషిగా తేలుస్తూ లండన్‌లోని సైత్‌వార్క్ క్రౌన్ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)లో కెయిన్స్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వెలుగుచూశాయి.