లండన్ : బాల్‌ట్యాంపరింగ్ వివాదంతో నిషేధం ఎదుర్కొని పునరాగమనం చేసిన ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదని, కాస్త తోలు మందం చేసుకోవాలని ఆ దేశ మాజీ క్రికెటర్ బ్రెట్‌లీ అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్ టోర్నీలో స్లెడ్జింగ్, ప్రేక్షకులు కలిగించే ఇబ్బందులను ఎదుర్కోవడానికి అది ఉపయోగపడుతుందన్నాడు.
ఈ ఇద్దరు ఆటగాళ్లు 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పపడి ఏడాదిపాటు సస్పెన్షన్ గురైన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచకప్ రెండు వార్మప్ మ్యాచుల్లో స్మిత్, వార్నర్ చిక్కులు ఎదుర్కున్నారు. వార్నర్, స్మిత్ చీటర్స్ అంటూ అభిమానులు కామెంట్ చేశారు. ఈ ఇద్దరు ఆటగాళ్లే లక్ష్యంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో బ్రెట్‌లీ వారికి మద్దతుగా నిలిచాడు.
‘ప్రస్తుతం ఈ ఇద్దరు ఆటగాళ్లు నిరూపించుకోవాల్సిందేం లేదు. ఆస్ట్రేలియా తరఫున పునరాగమనం చేసినందుకు వారిద్దరూ సంతోషపడాలి. డెవిడ్ వార్నర్ ఐపీఎల్ అదరగొట్టడం మనమంతా చూశాం. అత్యధిక పరుగులతో ఆరేంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. స్మిత్ తొలి వార్మప్ మ్యాచ్‌లో సెంచరీతో రాణించాడు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులోకి వారిద్దరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించారు. ఆసీస్ విజయం సాధించడానికి స్మిత్, వార్నర్‌కు తగిన అవకాశం కల్పించారు. ముఖ్యంగా కెవిన్ పీటర్సన్ వంటి వారి స్లెడ్జింగ్ తట్టుకోవడానికి కాస్త తోలు మందం చేసుకుంటే సరిపోతుంది. ఆస్ట్రేలియా వరుసగా మ్యాచ్‌లు గెలిస్తే ఆరోసారి కూడా టైటిల్ అందుకుంటుంది. ప్రపంచకప్ గెలిచినప్పుడు కలిగే అనుభూతి ప్రపంచంలోనే చాలా గొప్పది. టైటిల్ కొట్టె సత్తా ఆసీస్ ఆటగాళ్లకు ఉంది. నేనెప్పుడు ఆసీస్‌కు వ్యతిరేకం కాదు.’ అని బ్రెట్‌లీ చెప్పుకొచ్చాడు. ఇక రేపు(శనివారం) అఫ్గానిస్తాన్‌తో ఆసీస్ తొలి మ్యాచ్ ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment