బ్రాడ్ 8/15 | Broad 8/15 | Sakshi
Sakshi News home page

బ్రాడ్ 8/15

Published Fri, Aug 7 2015 1:03 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM

బ్రాడ్ 8/15

బ్రాడ్ 8/15

♦ ఆస్ట్రేలియా 60కే ఆలౌట్  ఇంగ్లండ్ 274/4
♦ రూట్ అజేయ సెంచరీ  యాషెస్ నాలుగో టెస్టు
 
 నాటింగ్‌హామ్ : 94 నిమిషాల ఆట... 3 డకౌట్లు... 6 సింగిల్ డిజిట్ స్కోర్లు... 18.3 ఓవర్లు... 60 పరుగులకు ఆలౌట్... గురువారం ప్రారంభమైన యాషెస్ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సాగిన తీరు ఇది. ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (8/15) సంచలన బౌలింగ్‌కు నిలువెల్లా వణికిన క్లార్క్‌సేన తమ క్రికెట్ చరిత్రలో మరో చెత్త రికార్డును మూటగట్టుకుంది. 60 పరుగులకే ఆలౌటై టెస్టుల్లో ఏడో అత్యల్ప స్కోరును నమోదు చేసింది. అలాగే టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి ఇన్నింగ్స్‌లో అతి తక్కువ ఓవర్లు ఆడిన జట్టుగానూ రికార్డులకెక్కింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా వికెట్ల పతనం మూడో బంతి నుంచే మొదలైంది. 14 నిమిషాల వ్యవధిలో 16 బంతులు వేసిన ఇంగ్లిష్ పేసర్లు బ్రాడ్, వుడ్స్....  రోజర్స్ (0), వార్నర్ (0), స్మిత్ (6), మార్ష్ (0)లను అవుట్ చేశారు. కొద్దిసేపటికే వోజస్ (1) కూడా వెనుదిరగడంతో ఆసీస్ 21 పరుగులకు సగం జట్టు పెవిలియన్‌కు చేరుకుంది. తర్వాత క్లార్క్ (10), జాన్సన్ (13)లు ప్రతిఘటించే ప్రయత్నం చేసినా సహచరుల వైఫల్యంతో ఒత్తిడికి గురై వికెట్లను సమర్పించుకున్నారు. 

పేలవమైన టెక్నిక్‌తో ఆడిన ఆసీస్ బ్యాట్స్‌మెన్ బంతి గమనాన్ని అంచనా వేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ఏకంగా 9 మంది క్యాచ్ అవుట్‌ల ద్వారానే వెనుదిరిగారు. రోజర్స్ వికెట్ తీసిన బ్రాడ్.. కెరీర్‌లో 300 వికెట్ల క్లబ్‌లో చేరాడు. ఈ ఘనత సాధించిన ఐదో ఇంగ్లండ్ బౌలర్ బ్రాడ్.

   తర్వాత ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 65 ఓవర్లలో 4 వికెట్లకు 274 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి రూట్ (158 బంతుల్లో 124 బ్యాటింగ్; 19 ఫోర్లు, 1 సిక్స్), వుడ్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆతిథ్య జట్టు 214 పరుగుల ఆధిక్యంలో ఉంది. బెయిర్‌స్టో (74), కుక్ (43) రాణించారు. లిథ్ (14), బెల్ (1) విఫలమయ్యారు. 34 పరుగులకే 2 వికెట్లు పడిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను రూట్ నిలబెట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement