డైలమాలో ఇంగ్లండ్ క్రికెటర్
కటక్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అంతర్జాతీయ క్రికెటర్ దగ్గర్నుంచి, దేశవాళీ క్రికెటర్ వరకూ ఐపీఎల్లో ఆడటానికి అత్యధిక ప్రాధాన్యిత ఇస్తారు. ఇందుకు కారణం వారికి ఈ లీగ్ ద్వారా అధిక ఆర్ధిక ప్రయోజనం ఉండటమే. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జాస్ బట్లర్ డైలమాలో పడ్డాడు. ఈ ఏడాది జరిగే ఐపీఎల్లో బట్లర్ ఆడాలని అనుకుంటున్నా, అదే సమయంలో ఇంగ్లండ్కు ఐర్లాండ్ రెండు మ్యాచ్ల వన్డే సిరీస్ ఉంది. దాంతో వన్డే సిరీస్ ఆడాలా?లేక ఐపీఎల్ ఆడాలా?అనే దానిపై బట్లర్ ఇప్పట్నుంచి తర్జన భర్జన పడుతున్నాడు.
'కెరీర్ ఆఖరి రోజు వరకూ ఇంగ్లండ్ కు ప్రాతినిథ్యం వహించాలనే అనుకుంటున్నా. అయితే ఐర్లాండ్ తో వన్డే సిరీస్ కు ప్రతీ ఒక్క ఆటగాడు అందుబాటులో ఉండాలని ఈసీబీ కోరుకోవడంలో తప్పులేదు. ఇది నాకు నిజంగానే సంక్లిష్ట పరిస్థితి అని చెప్పొచ్చు. ఐపీఎల్ ఆడటం అనేది మధురమైన అనుభూతి. అదే సమయంలో నా సొంత జట్టు ఇంగ్లండ్ కు ఆడటం కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం ఏది ఆడాలి నిర్ణయించుకోవడం నాకు కష్టంగానే ఉంది. ఇదొక కఠినమైన ప్రశ్న'అని బట్లర్ తెలిపాడు.