జగజ్జేతగా అవతరించడానికి తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధుకు మరో అవకాశం లభించింది. వరుసగా రెండో ఏడాది ఆమె ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. గతేడాది గ్లాస్గో వేదికగా నొజోమి ఒకుహారా (జపాన్)తో 110 నిమిషాల సుదీర్ఘ తుది సమరంలో ఓడిపోయిన సింధు... ఈసారి స్వదేశానికి విశ్వ విజేతగా తిరిగొచ్చేందుకు మరో విజయం దూరంలో ఉంది. గత ఏడాది కాలంలో సింధు ఐదు మెగా ఈవెంట్స్‌లో ఫైనల్లోకి ప్రవేశించి ఐదుసార్లూ తుది మెట్టుపై బోల్తా పడింది. ఆరో ‘ఫైనల్’ను ఆమె చిరస్మరణీయం చేసుకోవాలని... చైనా గడ్డపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించాలని ఆశిస్తూ... బెస్టాఫ్ లక్... సింధు!
నాన్‌జింగ్ (చైనా): భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను అందుకునేందుకు పీవీ సింధు ఇంకొక్క విజయం దూరంలో నిలిచింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండో ఏడాది సింధు స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 21–16, 24–22తో ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)పై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో రెండుసార్లు (2014, 2015) విశ్వవిజేత, 2016 రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో సింధు అమీతుమీ తేల్చుకుంటుంది. మరో సెమీఫైనల్లో ఏడో సీడ్ మారిన్ 13–21, 21–16, 21–13తో హీ బింగ్‌జియావో (చైనా)పై గెలిచింది. మారిన్‌తో ముఖాముఖి రికార్డులో సింధు 5–6తో వెనుకంజలో ఉంది. అయితే మారిన్‌తో జరిగిన గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడుసార్లు సింధునే గెలుపొందడం విశేషం.
వెనుకబడి... పుంజుకొని
గతేడాది దుబాయ్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో... ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సెమీఫైనల్లో యామగుచి చేతిలో ఓడిపోయిన సింధుకు ఈసారీ గట్టిపోటీనే ఎదురైంది. 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు గేముల్లోనూ సింధు తొలుత వెనుకబడి ఆ తర్వాత తేరుకొని విజయం దక్కించుకోవడం ఆమె మెరుగైన ఆటతీరుకు నిదర్శనం. తొలి గేమ్ ఆరంభంలో అనవసర తప్పిదాలతో సింధు వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయింది. కానీ పాయింట్ల ఖాతా తెరిచిన తర్వాత ఆమె ఆటతీరు గాడిలో పడింది. స్కోరు 4–8 వద్ద సింధు వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 9–8తో తొలిసారి ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత యామగుచి ధాటికి సింధు మళ్లీ 10–12తో వెనుకబడింది. కానీ పట్టుదలతో ఆడిన ఈ హైదరాబాద్ అమ్మాయి జూలు విదిల్చింది. కళ్లు చెదిరే స్మాష్‌లు... డ్రాప్ షాట్‌లు సంధించి వరుసగా 8 పాయింట్లు గెలిచి 18–12తో ముందంజ వేసింది.
12–19 నుంచి 20–19 వరకు...
ఇక రెండో గేమ్‌లోనూ తొలుత యామగుచినే ఖాతా తెరిచింది. పాయింట్ల కోసం ఇద్దరూ హోరాహోరీగా పోరాడినా ఎక్కువసార్లు యామగుచినే పైచేయి సాధించింది. 6–2తో... 8–7తో... 11–7తో... 16–12తో... ఇలా ఆధిక్యం పెంచుకుంటూ పోయిన యామగుచి 19–12తో గేమ్ సొంతం చేసుకోవడానికి రెండు పాయింట్ల దూరంలో నిలిచింది. అయితే ఇక్కడే సింధు అద్భుతం చేసింది. నమ్మశక్యంకాని రీతిలో విజృంభించి వరుసగా 8 పాయింట్లు దక్కిం చుకొని 20–19తో విజయం ముంగిట నిలిచింది. అయితే యామగుచి తర్వాతి పాయింట్‌ను సాధించి స్కోరును 20–20తో సమం చేసింది. స్కోరు 22–21 వద్ద 41 షాట్‌లతో కూడిన ర్యాలీని యామగుచి గెలిచి మళ్లీ స్కోరును 22–22తో సమం చేసింది. పట్టువదలని సింధు 23–22తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత యామగుచి కొట్టిన షాట్ బయటకు వెళ్లడంతో సింధు ఖాతాలో మరో పాయింట్ చేరడంతోపాటు విజయం కూడా ఖాయమైంది.
ఇంకా నా లక్ష్యం పూర్తి కాలేదు. గతే డాదితో పోలిస్తే ఈసారి ఫైనల్లో మెరుగైన ఫలితం వస్తుందని భావిస్తున్నాను. మారిన్‌తో నేడు జరిగే తుది సమరానికి పకడ్బందీగా సమాయత్తం కావాలి. నా ఆటతీరుపై తనకు... తన ఆటతీరుపై నాకు సంపూర్ణ అవగాహన ఉంది. ఫైనల్లో నా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించి విజయం సాధించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. జపాన్ క్రీడాకారిణులు యామగుచి, ఒకుహారా సుదీర్ఘ ర్యాలీలు ఆడతారు. ఈ ఇద్దరితో ఆడే సమయంలో ఏకాగ్రత, సహనం, నిలకడ కోల్పోకూడదు. యామగుచితో రెండో గేమ్‌లో నేను వెనుకబడిన సమయంలో ఎలాంటి ఆందోళన చెందలేదు. చివరి పాయింట్ వరకు పోరాడాలని, పుంజుకోవాలని ప్రయత్నించాను.
– పీవీ సింధు
Comments
Please login to add a commentAdd a comment