సింధుకు షాక్‌ | Yamaguchi Claws Back To Beat PV Sindhu | Sakshi
Sakshi News home page

సింధుకు షాక్‌

Published Thu, Dec 12 2019 1:35 AM | Last Updated on Thu, Dec 12 2019 1:35 AM

 Yamaguchi Claws Back To Beat PV Sindhu - Sakshi

పీవీ సింధు

గ్వాంగ్‌జౌ (చైనా): బ్యాడ్మింటన్‌ సీజన్‌ ముగింపు టోర్నీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్, భారత స్టార్‌ పీవీ సింధుకు తొలి లీగ్‌ మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది. ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ అకానె యామగుచి (జపాన్‌)తో జరిగిన గ్రూప్‌ ‘ఎ’ లీగ్‌ మ్యాచ్‌లో ప్రపంచ ఆరో ర్యాంకర్‌ సింధు 21–18, 18–21, 8–21తో ఓడిపోయింది. 68 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌ను గెలిచి, రెండో గేమ్‌లో 11–6తో ఆధిక్యంలో నిలిచి విజయం దిశగా సాగింది. అయితే ఈ ఏడాది సింధుతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన  ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ యామగుచి పట్టువిడవకుండా పోరాడింది. స్కోరు 11–15తో ఉన్నదశలో యామగుచి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 16–15తో ఆధిక్యంలోకి వచ్చింది.

ఆ తర్వాత సింధుపై మరింత ఒత్తిడి పెంచిన యామగుచి గేమ్‌ను గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో యామగుచి చెలరేగిపోగా... సింధు డీలా పడింది. ఆరంభంలోనే 5–0తో ఆధిక్యంలోకి వెళ్లిన యామగుచి ఆ తర్వాత సింధుకు ఏదశలోనూ కోలుకునే అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించింది. నేడు జరిగే గ్రూప్‌ ‘ఎ’ రెండో లీగ్‌ మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ చెన్‌ యుఫె (చైనా)తో సింధు ఆడుతుంది. సెమీఫైనల్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో సింధు తప్పనిసరిగా గెలవాలి. ముఖాముఖి రికార్డులో సింధు 6–3తో చెన్‌ యుఫెపై ఆధిక్యంలో ఉంది. ఈ ఏడాది చెన్‌ యుఫెతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ సింధునే నెగ్గింది.

సింధుకు డోప్‌ పరీక్ష!
యామగుచితో మ్యాచ్‌ ముగిసిన తర్వాత సింధుకు డోప్‌ పరీక్ష నిర్వహించారు. గత రెండు నెలల్లో సింధుకు ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా), జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) ఆధ్వర్యంలో నాలుగుసార్లు (డెన్మార్క్, పారిస్, హైదరాబాద్‌) డోప్‌ టెస్టులు జరిగాయని సింధు తండ్రి రమణ తెలిపారు. నేడు చైనా ప్లేయర్‌ చెన్‌ యుఫెతో మ్యాచ్‌ ఉందనగా చైనా కాలమానం ప్రకారం రాత్రి ఒకటిన్నరకు సింధుకు డోప్‌ టెస్టు నిర్వహించడంపట్ల రమణ అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండో మ్యాచ్‌కు ముందు సింధుకు తగిన విశ్రాంతి లభించకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement