కొడితే కుంభస్థలం కొట్టాలి. భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు అదే చేసింది. ఒకటి కాదు... రెండు కాదు... మూడు కాదు... గత 15 నెలల కాలంలో తాను ఫైనల్‌కు చేరిన ఏడు టోర్నమెంట్‌లలో తుది మెట్టుపై బోల్తా పడిన ఆమె ఎనిమిదోసారి మాత్రం అద్భుతమే చేసింది. సీజన్ ముగింపు ప్రతిష్టాత్మక టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో చాంపియన్‌గా అవతరించింది. గతంలో ఏ భారతీయ ప్లేయర్‌కూ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకుంది. తన అసమాన ఆటతీరుతో దేశం మొత్తం గర్వపడేలా చేసింది. ఈ ఏడాది ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సర్క్యూట్‌లో నిలకడగా రాణించినప్పటికీ... లోటుగా ఉన్న టైటిల్‌ను సీజన్ ముగింపు టోర్నమెంట్‌లో సాధించి విమర్శకుల నోళ్లు మూయించింది.
గ్వాంగ్‌జౌ (చైనా): ఏ లక్ష్యంతోనైతే పీవీ సింధు చైనాకు బయలుదేరిందో దానిని సగర్వంగా పూర్తి చేసింది. ‘ఫైనల్ ఫోబియా’ అలవాటు అయిందని క్రీడా విశ్లేషకులు చేస్తున్న విమర్శలకు... తన కెరీర్‌లోనే అతి పెద్ద విజయాన్ని అందుకొని తగిన రీతిలో సమాధానం ఇచ్చింది. 2018 బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో 23 ఏళ్ల సింధు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ సింధు 62 నిమిషాల్లో 21–19, 21–17తో ప్రపంచ ఐదో ర్యాంకర్, 2017 ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)పై విజయం సాధించింది. విజేతగా నిలిచిన సింధుకు స్వర్ణ పతకంతోపాటు లక్షా 20 వేల డాలర్ల (రూ. 86 లక్షల 31 వేలు) ప్రైజ్‌మనీ... 12,000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రన్నరప్ ఒకుహారాకు రజత పతకంతోపాటు 60 వేల డాలర్ల (రూ. 43 లక్షల 15 వేలు) ప్రైజ్‌మనీ... 10,200 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి.
వరుసగా మూడో ఏడాది వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన సింధు 2016లో సెమీఫైనల్లో ఓడిపోయింది. 2017లో అకానె యామగుచి (జపాన్)తో జరిగిన హోరాహోరీ ఫైనల్లో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. మూడో ప్రయత్నంలో మాత్రం తన పతక వర్ణాన్ని రజతం నుంచి స్వర్ణంగా మార్చుకుంది. ఒకుహారాతో 13సారి తలపడిన సింధు ఈసారి ప్రత్యేక వ్యూహంతో బరిలోకి దిగింది. గతంలో వీరి మ్యాచ్‌ల్లో 50 నుంచి 60 షాట్‌లతో కూడిన ఎన్నో సుదీర్ఘ ర్యాలీలు కనిపించాయి. ఈసారి అలాంటి సుదీర్ఘ ర్యాలీలు జరుగకుండా సింధు జాగ్రత్త పడింది. సాధ్యమైనంత దూకుడుగా ఆడిన ఈ తెలుగు తేజం తొలి గేమ్ ఆరంభంలోనే 14–6తో ఎనిమిది పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించింది. కానీ సింధు ఆటతీరుపై మంచి అవగాహన ఉన్న ఒకుహారా నెమ్మదిగా తేరుకుంది. స్కోరును 16–16 వద్ద సమం చేసింది. అయితే కీలకదశలో సింధు ఏకాగ్రత చెదరకుండా, ఓపికతో ఆడింది.
స్కోరు 17–17 ఉన్నపుడు వరుసగా మూడు పాయింట్లు గెలిచి 20–17తో ముందంజ వేసింది. అయితే పట్టువదలని ఒకుహారా రెండు పాయింట్లు నెగ్గి సింధు ఆధిక్యాన్ని 20–19కి తగ్గించింది. ఈ దశలో సుదీర్ఘ ర్యాలీని అద్భుతమైన డ్రాప్ షాట్‌తో ముగించి సింధు తొలి గేమ్‌ను 29 నిమిషాల్లో 21–19తో కైవసం చేసుకుంది. రెండో గేమ్ కూడా హోరాహోరీగా మొదలైంది. ఆరంభంలోనే సింధు 7–4తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ ఒకుహారా తీవ్రంగా పోరాడింది. వరుసగా మూడు పాయింట్లు గెలిచి స్కోరును 7–7తో సమం చేసింది. గతంలో ఆధిక్యాన్ని కోల్పోయినపుడు ఆందోళనతో అనవసర తప్పిదాలు చేసిన సింధు ఈసారి మాత్రం పాయింట్లు పోతున్నా కంగారు పడలేదు. తన అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించి తేరుకునేందుకు ప్రయత్నించింది. ఆమె చేసిన ఈ ప్రయత్నం విజయవంతమైంది. కీలకదశలో పైచేయి సాధించిన సింధు 11–9 ఆధిక్యంతో విరామానికి వెళ్లింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ ఒకుహారాకు స్కోరును సమం చేసే అవకాశం ఇవ్వలేదు. 20–17 వద్ద సింధు స్మాష్ షాట్‌తో మ్యాచ్‌ను ముగించి విజయగర్జన చేసింది. 20–17 వద్ద సింధు స్మాష్ షాట్‌తో మ్యాచ్‌ను ముగించి విజయగర్జన చేసింది.
►కెరీర్‌లో సింధు సాధించిన అంతర్జాతీయ టైటిల్స్ సంఖ్య -14
►వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో సింధు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అజేయంగా నిలిచింది.-5
►ఈ టోర్నీలో సింధు కోర్టులో గడిపిన మొత్తం నిమిషాలు. 265
►ఈ టోర్నీలో సింధు నెగ్గిన గేమ్‌లు. తన ప్రత్యర్థులకు ఆమె ఒక గేమ్‌ను మాత్రమే కోల్పోయింది. ఓవరాల్‌గా 231 పాయింట్లు నెగ్గిన సింధు 191 పాయింట్లు సమర్పించుకుంది. -10
►తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ముగ్గురు క్రీడాకారిణులను సింధు ఈ టోర్నీలో ఓడించింది. ప్రస్తుతం ఆరో ర్యాంక్‌లో ఉన్న సింధు... లీగ్ దశలో రెండో ర్యాంకర్ అకానె యామగుచిపై, నంబర్‌వన్ తై జు యింగ్‌పై... ఫైనల్లో ఐదో ర్యాంకర్ ఒకుహారాపై గెలిచింది.-3
►ఈ విజయం కంటే ముందు సింధు వరుసగా ఏడు ఫైనల్స్‌లో (2017లో హాంకాంగ్ ఓపెన్, సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ, 2018లో ఇండియా ఓపెన్, కామన్వెల్త్ గేమ్స్, థాయ్‌లాండ్ ఓపెన్, ప్రపంచ చాంపియన్‌షిప్, ఏషియన్ గేమ్స్) ఓడిపోయింది. -7
Comments
Please login to add a commentAdd a comment