
అనూహ్యంగా బయటపడిన బాల్ ట్యాంపరింగ్ వివాదం పెద్ద కుదుపులకే దారి తీస్తోంది. గత రెండు రోజులు నుంచి అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై జీవితకాల నిషేధం వంటి మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ ఆటగాడు కెమరాన్ బెన్ క్రాప్ట్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన వీడియో వైరల్ కావడంతో క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతిష్ట మసకబారింది. ఈ నేపథ్యంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఏకంగా ఆ దేశ ప్రధాని మార్కమ్ టర్న్‌బుల్ ఆదేశించారు. దీంతో ఈ ఘటనకు సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ చేపడుతోంది.
ఇదిలా ఉండగా తాజాగా బయటపడిన ఓ వీడియో ఆస్ట్రేలియా క్రికెట్‌ను మరింత వివాదంలోకి నెట్టింది. గత జనవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్‌లోనూ కెమరాన్ బెన్ క్రాప్ట్ బాల్ టాంపరింగ్ చేసినట్టు అనుమానం కలిగిలే ఓ వీడియా ఇప్పుడు బయటకొచ్చింది. అందులో బెన్ క్రాప్ట్ ఓ స్పూన్‌తో చక్కెర తీసుకుని ప్యాంటు పోకెట్‌లో వేసుకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. దీంతో బెన్ క్రాప్ట్ చక్కెరతో బంతి షేప్‌ను మార్చే ప్రయత్నం చేశాడా అన్న సందేశాలు కలుగుతున్నాయి. సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయినట్టుగా భావిస్తున్నఈ వీడియోను ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్ ప్రచురించగా, ద సన్ రిపోర్టర్ డేవిడ్ కవర్‌డేల్ తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. తాజా ఘటనతో క్రికెట్ అభిమానులు నివ్వెరపోతున్నారు. అయితే తన కెప్టెన్సీలో ఇలాంటి సంఘటనలు జరగడం మొదటిసారి అని చెప్పిన స్టీవ్ స్మిత్ మాటలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment