ఈ ‘వేగం’ సరిపోతుందా! | Can Indian attack stand up to South africa test? | Sakshi
Sakshi News home page

ఈ ‘వేగం’ సరిపోతుందా!

Published Sun, Dec 1 2013 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 1:08 AM

Can Indian attack stand up to South africa test?

ఒక్క మ్యాచ్‌లో 20 వికెట్లు తీయగల బౌలర్లు ఉంటేనే టెస్టు గెలవగలం. ఏ దేశంలో, ఏ పరిస్థితుల్లో అయినా అన్ని జట్లు చూసేది ఇదే. స్వదేశంలో టెస్టుల్లో స్పిన్నర్లు చకచకా వికెట్లు తీస్తారు... కాబట్టి భారత్ స్వదేశంలో  టెస్టుల్లో దూసుకుపోతోంది. మరి దక్షిణాఫ్రికాలో పరిస్థితి ఏమిటి? పేసర్లకు స్వర్గధామంలాంటి పిచ్‌లపై టెస్టులో 20 వికెట్లు తీయగల సత్తా భారత సీమర్లకు ఉందా?
 
 సాక్షి క్రీడావిభాగం
 దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ ఆడబోతోంది కేవలం రెండు టెస్టులు మాత్రమే. కానీ ఈ పర్యటనకు కావలసినంత ప్రచారం వచ్చేసింది. ర్యాంకుల్లో మొదటి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య పోరాటం కావడం ఒక కారణమైతే... సీనియర్లంతా వైదొలిగిన తర్వాత భారత జట్టుకు ఇది మొదటి పర్యటన. దీంతో భారత జట్టు భవిష్యత్ ఎలా ఉండబోతోందనే అంశం ఈ పర్యటన ద్వారా తేలుతుందనేది ఆసక్తికర అంశం.
 
 
 బ్యాటింగ్‌లో అనుభవం లేకపోయినా రోహిత్, విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్, ధోని, పుజారాల రూపంలో అందరూ ఫామ్‌లో ఉన్న క్రికెటర్లు ఉన్నారు. ముఖ్యంగా పుజారా, రోహిత్ సాంకేతికంగా ఉన్నతంగా ఆడుతున్నారు. కాబట్టి ఈ విభాగం నుంచి పెద్దగా ఆందోళన లేదు. కానీ అసలు సిసలు పరీక్ష బౌలింగ్. ముఖ్యంగా పేస్ బౌలర్లు ఏం చేస్తారనేది చూడాలి.
 
 స్పిన్నర్‌కు అవకాశం ఉందా?
 విదేశాల్లో టెస్టుల్లో సాధారణంగా భారత్ ముగ్గురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగుతుంది. ఈసారి కూడా ఇదే వ్యూహాన్ని అవలంబించే అవకాశం ఉంది. అయితే పేస్‌కు సహకరించే పిచ్‌పై నలుగురు పేసర్లతో ఎందుకు ఆడకూడదు? అనేది ఓ ఆలోచన. ఆల్‌రౌండర్ రూపంలో జడేజాను జట్టులోకి తీసుకుంటే నలుగురు పేసర్లతో ఆడటానికి అవకాశం ఉంటుంది. కానీ ఓవర్‌రేట్ సమస్యగా మారుతుంది. అశ్విన్‌ను ఆపి నలుగురు పేసర్లతో ధోని బరిలోకి దిగుతాడా అనేది సందేహమే.
 
 జహీర్, షమీ, భువనేశ్వర్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్‌ల రూపంలో జట్టులో ఐదుగురు పేసర్లు ఉన్నారు. ఇందులో జహీర్, షమీ తుది జట్టులో ఉండటం ఖాయం. మూడో పేసర్ స్థానం కోసం భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్‌ల మధ్య పోటీ ఉండొచ్చు. కొత్త బంతితో అద్భుతాలు చేయగలగడం భువనేశ్వర్ బలం. కానీ బంతి పాతబడ్డాక భువీ నుంచి పెద్దగా ఏమీ ఆశించలేం. కాబట్టి కొత్త బంతితో వికెట్లు తీయడం కోసమే భువనేశ్వర్‌ను తీసుకుంటారా అనేది ఆలోచించాలి. ఉపఖండంలో ఓ 15-20 ఓవర్ల తర్వాత పేసర్‌తో పనిలేదు కాబట్టి... భువీ స్థానం పదిలమే. కానీ దక్షిణాఫ్రికాలో ఇది సరిపోతుందా అనేది సందేహమే. ఉమేశ్ నిలకడగా 140-150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలడు. కాబట్టి పేస్ కోసం ఉమేశ్ వైపు మొగ్గొచ్చు. ఒకవేళ నలుగురు పేసర్లతో ఆడితే ఈ ఇద్దరూ తుది జట్టులో ఉండొచ్చు.
 
 రివర్స్ రాబడతారా?
 ప్రస్తుత సిరీస్‌లో జహీర్‌ఖాన్ మీద ఆశలు భారీగా ఉన్నాయి. జట్టులోకి ఏడాది తర్వాత వచ్చినా ఈ ఎడంచేతి సీమర్ బౌలింగ్ విభాగానికి కెప్టెన్ అనే అనుకోవాలి. ఇప్పటివరకూ దక్షిణాఫ్రికాలో జహీర్ 12 ఇన్నింగ్స్‌ల్లో 23 వికెట్లు తీశాడు. జహీర్ టెస్టు ఆడి ఏడాది గడిచింది. కానీ ఈ సీజన్ రంజీల్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. మొత్తానికి జహీర్ ఆత్మవిశ్వాసంతోనే ఉన్నాడు. జహీర్ ఖాన్ బలం రివర్స్ స్వింగ్. ఉపఖండంలో పిచ్‌లపై కూడా రివర్స్ స్వింగ్‌తో వికెట్లు తీయగలడు. తాజాగా షమీ కూడా రివర్స్ స్వింగ్ అంశంలో మెరుగ్గా కనిపిస్తున్నాడు. జహీర్, షమీ ద్వయం పాత బంతితో ఏం చేయగలదనే అంశం కూడా భారత ప్రణాళికల్లో కీలకం.
 
 అందరికీ కీలకమే
 ఈ పర్యటన భారత పేసర్లందరికీ కీలకమే. బీసీసీఐ కాంట్రాక్టు కూడా కోల్పోయి... ఇక జట్టులోకి రావడం కష్టమే అనుకున్న స్థితిలో జహీర్‌కు అనుకోకుండా దక్షిణాఫ్రికా పర్యటన అవకాశం లభించింది. దీనిని ఉపయోగించుకుని మళ్లీ జట్టులో కుదురుకోవాలి. జహీర్ నిలకడగా రాణిస్తేనే భారత్‌కు విజయావకాశాలు ఉంటాయనడంలో సందేహం లేదు. ఒకవేళ ఫామ్ పరంగా తాను ఇబ్బందిపడ్డా... తన అనుభవంతో యువ పేసర్లను నడిపించాల్సిన బాధ్యత ఈ స్టార్ పేసర్‌ది. కాబట్టి ఈ పర్యటనలో జహీర్ అందరికంటే కీలకం.
 
 ఇక భువనేశ్వర్, షమీ స్వదేశంలో టెస్టుల్లో రాణించారు. విదేశాల్లో అది కూడా దక్షిణాఫ్రికాలాంటి పేస్ బౌలింగ్ పిచ్‌లపై ఇదే ఆత్మవిశ్వాసాన్ని కొనసాగించాలి. ఈ పర్యటనలో రాణిస్తే ఇక టెస్టుల్లో స్థానాలు పదిలంగా మారతాయి. కాబట్టి ఈ యువ ద్వయానికి ఇది అద్భుతమైన అవకాశం.
 
 మరోవైపు ఉమేశ్ యాదవ్, ఇషాంత్‌లకు ఇది చావోరేవో తేల్చుకోవాల్సిన పర్యటన. రెండు టెస్టుల సిరీస్ కాబట్టి వీరికి అవకాశాలు ఏ మేరకు దొరుకుతాయనేది చెప్పలేం. ఒకవేళ అవకాశం దొరికితే... దానిని వినియోగించుకోవడంలో విఫలమయ్యారంటే మాత్రం... ఇక అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాత్కాలికంగా కనుమరుగైనా ఆశ్చర్యపోవాల్సిందేం లేదు.
 
 ‘జహీర్ దక్షిణాఫ్రికా పర్యటనలో చాలా కీలకం. అక్కడ ఆడిన అనుభవం ద్వారా జహీర్... షమీ, భువనేశ్వర్‌లాంటి కుర్రాళ్లకు ఉపయోగపడతాడు. ఒక్కసారి కుదురుకున్నాడంటే జహీర్ వరుసగా వికెట్లు తీయగల సత్తా ఉన్న బౌలర్.’     
 -సునీల్ గవాస్కర్
 
 టెస్టు ఆటగాళ్లను ముందే పంపిద్దాం!
 ముంబై: దక్షిణాఫ్రికాలో వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేందుకు వీలుగా కొంత మంది స్పెషలిస్ట్ టెస్టు ఆటగాళ్లను ముందే అక్కడికి పంపించాలని బీసీసీఐ భావిస్తోంది. జహీర్‌ఖాన్‌ను వన్డే జట్టుతో పాటే పంపాలని కెప్టెన్ కోరడంతో... ఈ సీనియర్ పేసర్ ఇప్పటికే ప్రయాణ సన్నాహకాలు చేసుకున్నాడు.
 
 ‘జహీర్ ఖాన్‌ను ఒక్కడినే కాకుండా మిగతా వారిని కూడా వీలైనంత ముందే పంపించాలని భావిస్తున్నాం. అయితే అక్కడ హోటల్ రూమ్‌లు అందుబాటులో ఉండటంపై ఇది ఆధారపడి ఉంటుంది’ అని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ అన్నారు. పేసర్ జహీర్ ఖాన్, చతేశ్వర్ పుజారా, మురళీ విజయ్, వృద్ధిమాన్ సాహా, స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాలకు కేవలం టెస్టు జట్టులో మాత్రమే చోటు దక్కింది. డిసెంబర్ 5 నుంచి జరగబోయే వన్డే సిరీస్ కోసం భారత జట్టు ఆదివారం రాత్రి దక్షిణాఫ్రికాకు బయదేరుతుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement