
మెస్సీని ఆపితేనే..
ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఒంటిచేత్తో అర్జెంటీనాను నడిపిస్తున్న స్టార్ ఆటగాడు మెస్సీ ఒకవైపు.. నాకౌట్‌లో అమెరికా ‘గోడ’ హొవార్డ్‌ను అధిగమించిన బెల్జియం జట్టు మరోవైపు.. మూడో క్వార్టర్ ఫైనల్లో ఈ రెండు జట్ల మధ్య ఆసక్తికర సమరం జరగనుంది. మరో క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్‌తో కోస్టారికా అమీతుమీ తేల్చుకోనుంది.
అర్జెంటీనా
డీగో మారడోనా సారథ్యంలో 1986లో ప్రపంచకప్ గెలిచాక మళ్లీ అర్జెంటీనా ఎప్పుడూ టైటిల్ నెగ్గలేదు. ఈసారి టోర్నీలో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచి జోరు మీద ఉంది. ప్రపంచకప్ చరిత్రలో 1982లో స్పెయిన్‌లో జరిగిన టోర్నీలో మాత్రమే బెల్జియం జట్టు అర్జెంటీనాను ఓడించగలిగింది.
బలం: ప్రధాన ఆయుధం మెస్సీ. తననే నమ్ముకుని బరిలోకి దిగుతోంది. తనపై జట్టు పెట్టుకున్న అంచనాలకు తగ్గట్లే ఈ సూపర్ స్టార్ రాణిస్తుండటం బలం. స్ట్రయికర్లు లవెజ్జి, పలాసియోతో పాటు మిడ్ ఫీల్డర్లు డి మారియా, పెరెజ్ జట్టుకు ఉపయోగపడే ఆటగాళ్లు.
బలహీనత: మెస్సీపైనే అధికంగా ఆధారపడుతుండడం జట్టును ఇబ్బంది పెట్టే అంశం. ఈ విషయం నాకౌట్ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌పై బయటపడింది. ప్రణాళికాబద్ధంగా ఆడిన స్విస్ ఆటగాళ్లు మెస్సీని కట్టడి చేయగలిగారు. స్ట్రయికర్ అగియోరో కండరాల నొప్పితో బాధపడుతున్నాడు.
నెదర్లాండ్స్
ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్‌కు షాక్ ఇచ్చిన నెదర్లాండ్స్... ఆ తర్వాత ఓటమి లేకుండా క్వార్టర్స్‌కు దూసుకొచ్చింది. మైదానంలో చురుకైన కదలికలతో ప్రత్యర్థులను కట్టిపడేస్తూ అనుకున్న ఫలితాలను సాధిస్తోంది. తొమ్మిది సార్లు టోర్నీలో బరిలోకి దిగినా టైటిల్ వేటలో వెనుకబడింది. ఈసారి మాత్రం ప్రపంచకప్‌ను కొట్టాల్సిందే అనే భావనతో ఆరెంజ్ సేన ఉంది.
బలం: స్టార్ స్ట్రయికర్లు రాబిన్ వాన్ పెర్సి, అర్జెన్ రాబెన్‌లు తమ జట్టుకు పెట్టని కోటగా ఉన్నారు. ముఖ్యంగా మైదానంలో రాబెన్ వేగాన్ని అందుకోకుంటే ప్రత్యర్థికి ఇబ్బందులు తప్పవు. మిడ్ ఫీల్డ్‌లో స్నైడర్ కీలక ఆటగాడు.
బలహీనత: హాలెండ్ డిఫెన్స్ విభాగంలో లోపాలున్నాయి. మిడ్ ఫీల్డర్ నెజైల్ డి జోంగ్ గాయం కారణంగా జట్టుకు దూరమవుతున్నాడు.
రాత్రి 9.30 గంటలకు సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
బెల్జియం
ప్రత్యర్థి అర్జెంటీనాలా ఒక్క ఆటగాడిపైనే ఆధారపడకుండా సమష్టిగా ముందుకెళుతూ బెల్జియం జట్టు అద్భుత ఫలితాలను సాధిస్తోంది. పేరున్న స్టార్ ఆటగాళ్లెవరూ లేకపోయినా తమ పని తాము చేసుకుపోతోంది. లీగ్, నాకౌట్‌లో ఆడిన అన్ని మ్యాచ్‌లను గెలుచుకుని ఉత్సాహంతో ఉంది. అలాగే ప్రిక్వార్టర్స్‌లో అమెరికాపై సాధించిన అద్భుత విజయం జట్టు ఆటగాళ్లలో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇదే జోరుతో మెస్సీ బృందంపై పైచేయి సాధించాలనే కసితో ఉంది.
బలం: జట్టు డిఫెన్స్ పటిష్టంగా ఉంది. అలాగే స్టార్ మిడ్ ఫీల్డర్ ఈడెన్ హజార్డ్ గ్రూప్ దశలో కీలకమయ్యాడు. అయితే తను ఇంకా పూర్తి స్థాయిలో రాణించాల్సి ఉంది. డిఫెండర్ థామస్ వెర్మలెన్ జట్టులో చేరనున్నాడు. మిడ్ ఫీల్డర్ కెవిన్ డి బ్రూనే ఉపయోగపడగలడు.
బలహీనత: ఒక్కోసారి కీలక ఆటగాళ్ల మధ్య సమన్వయం కొరపడుతుండడం జట్టును ఆందోళన పరిచే విషయం.
కోస్టారికా
ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ఈ జట్టు లీగ్ దశ కూడా దాటదని అంతా అనుకున్నారు. కానీ సంచలన ఆటతీరుతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ తొలిసారి క్వార్టర్స్‌కు చేరింది. గ్రూప్ డిలో ఇటలీ, ఉరుగ్వే, ఇంగ్లండ్ జట్లను దాటుకుని వచ్చిన ఈ జట్టును ఆరెంజ్ సేన తక్కువ అంచనా వేస్తే ఫలితం అనుభవిస్తుంది. నాకౌట్‌లో గ్రీస్‌తో గంటకు పైగా పది మంది ఆటగాళ్లతోనే ఆడినా మ్యాచ్‌ను గెలుచుకున్న తీరు అద్భుతం.
బలం: స్ట్రయికర్లు జోయెల్ క్యాంప్‌బెల్, బ్రియాన్ రూయిజ్ అటాకింగ్ గేమ్ ప్రత్యర్థికి ఇబ్బందే. గోల్ కీపర్ కీలర్ నవాస్ ఇప్పటికే సూపర్ సేవర్‌గా పేరు తెచ్చుకున్నాడు.
బలహీనత: సెంటర్ బ్యాక్ ఆటగాడు ఆస్కార్ డుయర్టే సస్పెండ్ కావడం, లెఫ్ట్ సైడ్ ఆటగాడు రాయ్ మిల్లర్ గాయం కారణంగా డిఫెన్స్ విభాగం బలహీనంగా కనిపిస్తోంది.
రాత్రి 1.30 గంటలకు సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం