
బెంగళూరు: ఇప్పటివరకూ ఐపీఎల్ టైటిల్ సాధించని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈసారి కచ్చితంగా టైటిల్‌ను గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఈనెల 19వ తేదీన ఐపీఎల్ వేలం జరుగనున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ క్యాష్ రిచ్ లీగ్ హడావుడి మొదలు కాగా, ఆర్సీబీ అప్పుడే తన ట్వీట్లతో అలరిస్తోంది. వచ్చే ఐపీఎల్‌లో తమ ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లిలు కొట్టే సిక్సర్లను కనిపెట్టడానికి నాసా సహాయం అవసరం ఉంటేందేమో అంటూ చమత్కరించింది. చంద్రయాన్-2 ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండర్ ఆచూకీని కనుగొన్న అమెరికాకు చెందిన స్పేస్ ఏజెన్సీ నాసాకు ఒక పనిపెట్టింది. ‘ నాసా టీమ్.. విక్రమ్ ల్యాండర్ ఆచూకీని కనిపెట్టిందా.. మాకు కూడా మీ అవసరం ఉంది. ఏబీడీ-కోహ్లిల బ్యాట్‌ల నుంచే వచ్చే సిక్సర్లను కూడా కనిపెట్టడానికి సాయం చేయండి’ అంటూ ఆర్సీబీ విన్నూత్నంగా ట్వీట్ చేసింది.
ఎట్టకేలకు విక్రమ్ ల్యాండర్ ఆచూకీ లభించింది. చంద్రుడి ఉపరితలంపై ఉన్న విక్రమ్ శిథిలాలను నాసా గుర్తించింది. ఇస్రో చంద్రయాన్-2లో భాగమైన విక్రమ్ ల్యాండర్.. చందమామ దక్షిణ ధ్రువంలో పడిపోయిందన్న విషయం తెలిసిందే. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ-నాసా తాజాగా ఇస్రో విక్రమ్ ల్యాండర్‌ను చందమామపై కనిపెట్టింది. అందుకు సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్‌లో షేర్ చేసింది.సెప్టెంబర్ 7వ తేదీన చంద్రుడిపై ల్యాండింగ్ సమయంలో విక్రమ్ అదుపు తప్పింది. ల్యాండర్ కోసం శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆచూకీ లభించలేదు.
చివరికు మంగళవారం విక్రమ్‌కు సంబంధించిన చిత్రాలను నాసా రిలీజ్ చేసింది. లూనార్ రికయినసెన్స్ ఆర్బిటార్ (ఎల్ఆర్‌వో) తీసిన ఫోటోల్లో విక్రమ్ కనిపించింది. అది కూలిన ప్రాంతాన్ని నాసా ఆర్బిటార్ చిత్రీకరించింది. విక్రమ్ శిథిలాలూ అక్కడే ఉన్నాయి. విక్రమ్ శిథిలాలను భారతీయ ఇంజినీర్ షణ్ముగ సుబ్రమణియన్ గుర్తించినట్లు నాసా చెప్పింది. విక్రమ్ గతితప్పిన వాయవ్య ప్రాంతానికి 750 మీటర్ల సమీపంలో విక్రమ్ శిథిలాలు కనిపించాయి.
Could the #NASA team that found #VikramLander also help us find the cricket balls hit by ABD & Virat 👀?
— Royal Challengers (@RCBTweets) December 3, 2019