కేప్‌టౌన్:భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లిని మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఇంకా 129 పరుగులు సాధిస్తే ఒక పర్యటనలో వెయ్యి పరుగుల్ని సాధించిన రెండో క్రికెటర్‌గా కోహ్లి నిలుస్తాడు. గతంలో వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ ఒక్కడే ఒక టూర్‌లో వెయ్యి పరుగుల్ని పూర్తి చేసిన క్రికెటర్. 1976లో ఇంగ్లండ్ పర్యటనలో నాలుగు టెస్టులు, మూడు టెస్టులు ఆడిన రిచర్డ్స్ 1,045 పరుగులు సాధించాడు. అంతకుముందు డాన్ బ్రాడమన్ ఒక పర్యటనలో వెయ్యి పరుగులను పూర్తి చేయడానికి దగ్గరగా వచ్చినా 26 పరుగుల దూరంలో నిలిచిపోయాడు.
ఇప్పుడు అరుదైన జాబితాలో చేరే అవకాశం కోహ్లి ముందుంది. దక్షిణాఫ్రికా పర్యటనలో సత్తా చాటిన కోహ్లి.. భారత జట్టు వన్డే సిరీస్‌ను 5-1తో గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆరు వన్డే సిరీస్‌లో 558 పరుగులు సాధించిన కోహ్లి.. ముందుగా జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో 286 పరుగులు సాధించాడు. ఇక తొలి రెండు టీ 20ల్లో కలిపి 27 పరుగులు చేశాడు. మొదటి టీ20లో 26 పరుగులు చేసిన కోహ్లి.. రెండో టీ20లో పరుగుకే అవుటయ్యాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో చివరి మ్యాచ్ అయిన మూడో టీ20లో కోహ్లి సెంచరీకి పైగా స్కోరు సాధిస్తే వెయ్యి పరుగుల్ని పూర్తి చేసుకుంటాడు. అదే సమయంలో అంతర్జాతీయ టీ20ల్లో తొలి శతకాన్ని కూడా కోహ్లి నమోదు చేస్తాడు. మరి వివియన్ రిచర్డ్స్ సరసన కోహ్లి నిలుస్తాడా?లేదో చూడాల్సింది.
Comments
Please login to add a commentAdd a comment