జింబాబ్వే జిగేల్ | Can Zimbabwe cap on-field progress with victory? | Sakshi
Sakshi News home page

జింబాబ్వే జిగేల్

Published Sun, Sep 15 2013 1:51 AM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM

జింబాబ్వే జిగేల్

జింబాబ్వే జిగేల్

హరారే:  సిరీస్‌కు ముందు జీతాల కోసం మ్యాచ్‌లను బాయ్‌కాట్ చేస్తామన్న జింబాబ్వే ఆటగాళ్లు... మైదానంలో మాత్రం విజృంభించారు. సమష్టిగా రాణించి 15 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌పై ఓ సంచలన విజయాన్ని నమోదు చేశారు. టెండీ చతారా (5/61) సూపర్ బౌలింగ్‌కు తోడు ఫీల్డర్లు చురుకుగా కదలడంతో హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో శనివారం ముగిసిన రెండో టెస్టులో ఆతిథ్య జట్టు 24 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. 264 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 81 ఓవర్లలో 239 పరుగులకు ఆలౌటైంది.
 
 కెప్టెన్ మిస్బా (79 నాటౌట్) ఒంటరి పోరాటం వృథా అయ్యింది. అద్నాన్ అక్మల్ (20), అబ్దుర్ రెహమాన్ (16) ఓ మోస్తరుగా ఆడారు. ఇప్పటివరకు 93 టెస్టులు ఆడిన జింబాబ్వే కేవలం 11 టెస్టుల్లో మాత్రమే గెలిచింది. 56 టెస్టుల్లో ఓడిపోయి, మిగతా 26 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. జింబాబ్వే సాధించిన 11 టెస్టు విజయాల్లో బంగ్లాదేశ్‌పై ఆరు, పాకిస్థాన్‌పై మూడు, భారత్‌పై రెండు విజయాలు ఉన్నాయి. 1998లో పెషావర్‌లో పాకిస్థాన్‌పై నెగ్గిన తర్వాత జింబాబ్వేకు ఆ జట్టుపై ఇదే తొలి విజయం.
 
 చతారా మెరుపులు  
 ఆఖరి రోజు పాకిస్థాన్ విజయానికి 106 పరుగులు కావాలి. చేతిలో ఐదు వికెట్లు ఉన్నాయి. అయితే 158/5 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన పాక్‌కు ఆరంభంలోనే చతారా షాకిచ్చాడు. ఐదు పరుగులు జతకూడిన తర్వాత కొత్త బంతితో అద్నాన్ అక్మల్‌ను ఎల్బీగా అవుట్ చేశాడు. తర్వాత వచ్చిన అబ్దుర్ రెహమాన్ ఆచితూచి ఆడుతూ మిస్బాతో కలిసి ఏడో వికెట్‌కు 34 పరుగులు జోడించాడు.
 
 ఈ దశలో పన్యాన్‌గర బంతిని ఆడబోయి కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ బౌలింగ్‌కు దిగిన చతారా.... సయీద్ అజ్మల్ (2)ను ఎల్బీగా వెనక్కి పంపాడు. వేగంగా వచ్చిన బంతిని కట్ చేయబోయిన అజ్మల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే ఓ ఎండ్‌లో సహచరులు వరుసగా అవుటవుతున్నా.. రెండో ఎండ్‌లో మిస్బా మాత్రం నిలకడగా ఆడాడు. దీంతో జింబాబ్వే 217/8 స్కోరుతో లంచ్‌కు వెళ్లింది. కానీ లంచ్ తర్వాత మ్యాచ్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్ట్రయిక్‌ను కాపాడుకోవడం కోసం చతారా, విటోరి వేసిన తొలి రెండు ఓవర్లలో మిస్బా కేవలం రెండు పరుగులే చేశాడు. అయితే చతారా తర్వాతి ఓవర్‌లో రెండు బౌండరీలతో 11 పరుగులు సాధించిన అతను విటోరి ఓవర్‌లోనూ మరో రెండు ఫోర్లు కొట్టాడు. కానీ రెండో బౌండరీతో జునైద్ (1)కు స్ట్రయిక్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ దశలో విజయానికి మరో 26 పరుగులు కావాలి.
 
  రెండో కొత్త బంతితో చతారా (80.4 ఓవర్) ... జునైద్‌ను అవుట్ చేసి పాక్‌కు షాకిచ్చాడు. తర్వాతి బంతికి చివరి బ్యాట్స్‌మన్ రాహత్ అలీ (1) సింగిల్ తీసి మిస్బాకు స్ట్రయిక్ ఇచ్చాడు. అయితే ఆఖరి బంతికి (80.6 ఓవర్) స్ట్రయిక్‌ను కాపాడుకునే ప్రయత్నంలో రాహత్ అలీని రనౌట్ చేయడంతో ఇన్నింగ్స్‌ను తెరపడింది. ఉత్సెయాకు 2 వికెట్లు దక్కాయి. చతారాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’; యూనిస్ ఖాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
 
 సంక్షిప్త స్కోర్లు
 జింబాబ్వే తొలి ఇన్నింగ్స్: 294; పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్: 230; జింబాబ్వే రెండో ఇన్నింగ్స్: 199; పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్: 239 (మిస్బా 79 నాటౌట్; అద్నాన్ అక్మల్ 20, చతారా 5/61).
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement