మార్చి 2017లో..., ఫిబ్రవరి 2018లో...
ప్యాంగ్‌చాంగ్: మృత్యువును జయిస్తేనే వార్తయితే... మృత్యువును, కాంస్యాన్ని జయించిన వ్యక్తిది కచ్చితంగా ఓ విజయగాథే అవుతుంది. ఇప్పుడు వింటర్ ఒలింపిక్స్‌లో అదే జరిగింది. కెనడాకు చెందిన స్నోబోర్డ్ ఆటగాడు మార్క్ మెక్‌మోరిస్ గతేడాది ఆరంభంలో చావు నుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు దక్షిణ కొరియాలోని ప్యాంగ్‌చాంగ్‌లో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌లో అతను స్లోప్‌స్టైల్‌లో కాంస్య పతకం గెలిచి పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించాడు.
ఇందులో అమెరికాకు చెందిన 17 ఏళ్ల టీనేజ్ కుర్రాడు రెడ్ గెరాడ్ బంగారు పతకం నెగ్గగా... కెనడాకే చెందిన మ్యాక్స్ పారట్ రజతం సాధించాడు. గతంలో ప్రపంచ స్నోబోర్డ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన మెక్‌మోరిస్ నాలుగేళ్ల క్రితం సోచి (రష్యా)లో జరిగిన గత వింటర్ ఒలింపిక్స్‌లోనూ కాంస్యం నెగ్గాడు. అయితే 11 నెలల క్రితం చావుకు అత్యంత చేరువయ్యాడు. ఇక బతికే పరిస్థితేలేనంత దూరం వెళ్లాడు. స్నోబోర్డే తన ప్రపంచమైన అతను 11 నెలల క్రితం లాస్ ఏంజెల్స్‌లో జరిగిన స్నోబోర్డ్ స్లోప్‌స్టైల్ ఈవెంట్‌లో పోటీ పడుతుండగా పెద్ద ప్రమాదమే జరిగింది.
బుల్లెట్ వేగంతో స్నోబోర్డ్‌పై దూసుకెళ్తున్న అతను పెద్ద చెట్టును బలంగా ఢీకొట్టాడు. దీంతో ముఖ్యమైన ఊపిరితిత్తులు, ఒంట్లోని ఎముకలు విరిగాయి. ఇక బతకడం కష్టమని డాక్టర్లు చేతులెత్తేశారు. కానీ దురదృష్టం ఢీకొట్టించినా... అదృష్టం ఊపిరిపోయడంతో బతికిపోయాడు. కోలుకునేందుకు నెలల సమయం పట్టింది. ఒక్కసారి పూర్తిగా కోలుకోగానే మళ్లీ స్నోబోర్డ్ బాటపట్టాడు. ఈ ఏడాది ఆరంభంలో కాంస్యం గెలుచుకున్నాడు. ఈ 24 ఏళ్ల ఈ స్నోబోర్డ్ స్కీయర్ తన అద్భుతమైన నైపుణ్యంతో అస్పెన్‌లో జరిగిన ఎక్స్ గేమ్స్‌లో నాలుగు స్వర్ణాలు గెలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment