చండిమల్‌ను కట్టడి చేస్తాం: మిశ్రా
కొలంబో : తొలి టెస్టులో వీరోచిత సెంచరీతో లంక జట్టును గెలిపించిన దినేశ్ చండిమల్‌ను కట్టడి చేస్తామని భారత లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా అన్నాడు. గురువారం నుంచి జరిగే రెండో టెస్టులో అలాంటి ప్రదర్శన పునరావృతం కాకుండా అడ్డుకుంటామన్నాడు. ‘చండిమల్ బ్యాటింగ్ వీడియోస్‌ను పరిశీలించాం. అతను అదే విధంగా దాడి చేస్తే మేం కూడా ఎదురుదాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అతనికి బౌలింగ్ ఎలా చేయాలన్న దానిపై జట్టు సమావేశంలో మరింతగా చర్చిస్తాం. మా వ్యూహాలకు తగ్గట్టుగా ఫీల్డర్లను మోహరిస్తాం. భారీ షాట్లు కొట్టకుండా ఒత్తిడి పెంచుతాం’ అని మిశ్రా పేర్కొన్నాడు.
స్పిన్ ఆడటంలో భారత బ్యాట్స్‌మెన్‌కు సరైన అనుభవం లేదనడం వాస్తవం కాదన్నాడు. కొన్నిసార్లు ఒత్తిడిలో ఒకటి, రెండు వికెట్లు పడిపోతాయని చెప్పాడు. గాలె టెస్టులో ఓడినా తమలో ఆత్మ విశ్వాసం ఏమాత్రం తగ్గలేదని తెలిపాడు. ‘రెండో ఇన్నిం గ్స్‌లో మరింత దూకుడుగా బ్యాటింగ్ చేయాల్సి ఉంది. ఓటమిని పక్కనబెడితే మాలో ఆత్మ విశ్వాసం పెరిగిందే తప్ప తగ్గలేదు. కాబట్టి రెండో టెస్టులో రెట్టింపు ఉత్సాహంతో బరిలోకి దిగుతాం. తొలి టెస్టులో కొన్ని తప్పులు జరిగాయి. వాటిని మెరుగుపర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని ముందుకెళ్తాం’ అని మిశ్రా చెప్పాడు.