Dinesh candimal
-
చండిమల్‌ను కట్టడి చేస్తాం: మిశ్రా
కొలంబో : తొలి టెస్టులో వీరోచిత సెంచరీతో లంక జట్టును గెలిపించిన దినేశ్ చండిమల్‌ను కట్టడి చేస్తామని భారత లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా అన్నాడు. గురువారం నుంచి జరిగే రెండో టెస్టులో అలాంటి ప్రదర్శన పునరావృతం కాకుండా అడ్డుకుంటామన్నాడు. ‘చండిమల్ బ్యాటింగ్ వీడియోస్‌ను పరిశీలించాం. అతను అదే విధంగా దాడి చేస్తే మేం కూడా ఎదురుదాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అతనికి బౌలింగ్ ఎలా చేయాలన్న దానిపై జట్టు సమావేశంలో మరింతగా చర్చిస్తాం. మా వ్యూహాలకు తగ్గట్టుగా ఫీల్డర్లను మోహరిస్తాం. భారీ షాట్లు కొట్టకుండా ఒత్తిడి పెంచుతాం’ అని మిశ్రా పేర్కొన్నాడు. స్పిన్ ఆడటంలో భారత బ్యాట్స్‌మెన్‌కు సరైన అనుభవం లేదనడం వాస్తవం కాదన్నాడు. కొన్నిసార్లు ఒత్తిడిలో ఒకటి, రెండు వికెట్లు పడిపోతాయని చెప్పాడు. గాలె టెస్టులో ఓడినా తమలో ఆత్మ విశ్వాసం ఏమాత్రం తగ్గలేదని తెలిపాడు. ‘రెండో ఇన్నిం గ్స్‌లో మరింత దూకుడుగా బ్యాటింగ్ చేయాల్సి ఉంది. ఓటమిని పక్కనబెడితే మాలో ఆత్మ విశ్వాసం పెరిగిందే తప్ప తగ్గలేదు. కాబట్టి రెండో టెస్టులో రెట్టింపు ఉత్సాహంతో బరిలోకి దిగుతాం. తొలి టెస్టులో కొన్ని తప్పులు జరిగాయి. వాటిని మెరుగుపర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని ముందుకెళ్తాం’ అని మిశ్రా చెప్పాడు. -
స్వల్ప లక్ష్యంపై అలక్ష్యం తగదు: అనిల్ కుంబ్లే
టెస్టు క్రికెట్లో రోజు ఆట ముగిసిన తర్వాత మరుసటి రోజు పిచ్ పరిస్థితి ఎలా ఉంటుందనేది అత్యంత ఆసక్తి రేపే అంశం. దీనికి తగ్గట్టుగా ఆటగాళ్లు తమ ఆటతీరును మార్చుకోవాల్సి ఉంటుంది. శుక్రవారం నాటి ఆటలో శ్రీలంక బ్యాట్స్‌మన్ దినేశ్ చండీమల్‌ను గమనించండి. తొలి ఇన్నింగ్స్‌లో తాను బ్యాటింగ్ చేసినప్పటికంటే రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ కాస్త నెమ్మదించిన విషయం అతడు వెంటనే ఆకళింపు చేసుకున్నాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి పరిస్థితులకు తగ్గట్టు ఆడి విజృంభించాడు. అలాగే భారత స్పిన్నర్లు కూడా చెలరేగారు. ముఖ్యంగా అశ్విన్ ఓవరాల్‌గా పది వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఈ విషయంలో సీనియర్ స్పిన్నర్ హర్భజన్ విఫలమయ్యాడు. అలాగే పేసర్ ఇషాంత్ కూడా పిచ్‌ను అర్థం చేసుకోలేదు. పిచ్ స్లో అయినప్పుడు షార్ట్ బంతులు పనికిరావు. ఇక నాలుగో ఇన్నింగ్స్‌లో స్వల్ప లక్ష్య ఛేదన అనుకున్నంత సులువు కాదు. ఇందులో కిటుకు ఏమిటంటే ఆటగాళ్లు తమ సహజశైలిలోనే ఆడుతూ వెళ్లడం. అంతేకానీ తక్కువ అంచనాతో దూకుడు పెంచితే మొదటికే మోసం వస్తుంది. టెస్టు క్రికెట్ అంటే ఇలాగే ఉంటుంది. జట్టుకు మంచి ఆరంభం అందితే మిగతా బ్యాట్స్‌మెన్ పని సులువవుతుంది. విరాట్ సేన ఈ మ్యాచ్‌లో ఐదుగురు బౌలర్లతో దిగిన విషయం గమనించాలి. దీంతో వీరికి ఓ బ్యాట్స్‌మన్ తగ్గాడు. ఇప్పటికే రాహుల్ అవుటయ్యాడు. వీరంతా చండీమల్‌ను ఉదాహరణగా తీసుకోవాలి. వికెట్లు పడుతున్నా అతడు ఆశావహ దృక్పథంతో ముందుకెళ్లాడు. నాలుగో రోజు ఆటలో లంక స్పిన్నర్ రంగన హెరాత్ భారత్‌ను ఎలా కట్టడి చేస్తాడో చూడాలనుంది. - అనిల్ కుంబ్లే