స్వల్ప లక్ష్యంపై అలక్ష్యం తగదు: అనిల్ కుంబ్లే
టెస్టు క్రికెట్‌లో రోజు ఆట ముగిసిన తర్వాత మరుసటి రోజు పిచ్ పరిస్థితి ఎలా ఉంటుందనేది అత్యంత ఆసక్తి రేపే అంశం. దీనికి తగ్గట్టుగా ఆటగాళ్లు తమ ఆటతీరును మార్చుకోవాల్సి ఉంటుంది. శుక్రవారం నాటి ఆటలో శ్రీలంక బ్యాట్స్‌మన్ దినేశ్ చండీమల్‌ను గమనించండి.
తొలి ఇన్నింగ్స్‌లో తాను బ్యాటింగ్ చేసినప్పటికంటే రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ కాస్త నెమ్మదించిన విషయం అతడు వెంటనే ఆకళింపు చేసుకున్నాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి పరిస్థితులకు తగ్గట్టు ఆడి విజృంభించాడు. అలాగే భారత స్పిన్నర్లు కూడా చెలరేగారు. ముఖ్యంగా అశ్విన్ ఓవరాల్‌గా పది వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఈ విషయంలో సీనియర్ స్పిన్నర్ హర్భజన్ విఫలమయ్యాడు. అలాగే పేసర్ ఇషాంత్ కూడా పిచ్‌ను అర్థం చేసుకోలేదు. పిచ్ స్లో అయినప్పుడు షార్ట్ బంతులు పనికిరావు.
ఇక నాలుగో ఇన్నింగ్స్‌లో స్వల్ప లక్ష్య ఛేదన అనుకున్నంత సులువు కాదు. ఇందులో కిటుకు ఏమిటంటే ఆటగాళ్లు తమ సహజశైలిలోనే ఆడుతూ వెళ్లడం. అంతేకానీ తక్కువ అంచనాతో దూకుడు పెంచితే మొదటికే మోసం వస్తుంది. టెస్టు క్రికెట్ అంటే ఇలాగే ఉంటుంది. జట్టుకు మంచి ఆరంభం అందితే మిగతా బ్యాట్స్‌మెన్ పని సులువవుతుంది.
విరాట్ సేన ఈ మ్యాచ్‌లో ఐదుగురు బౌలర్లతో దిగిన విషయం గమనించాలి. దీంతో వీరికి ఓ బ్యాట్స్‌మన్ తగ్గాడు. ఇప్పటికే రాహుల్ అవుటయ్యాడు. వీరంతా చండీమల్‌ను ఉదాహరణగా తీసుకోవాలి. వికెట్లు పడుతున్నా అతడు ఆశావహ దృక్పథంతో ముందుకెళ్లాడు. నాలుగో రోజు ఆటలో లంక స్పిన్నర్ రంగన హెరాత్ భారత్‌ను ఎలా కట్టడి చేస్తాడో చూడాలనుంది.
- అనిల్ కుంబ్లే