
ముంబై: ఇటీవల శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను విజయవంతంగా ముగించిన టీమిండియా ఇప్పుడు ఆస్ట్రేలియాతో మూడు వన్డేల పోరుకు సన్నద్ధమైంది. ఇరు జట్లు బలంగా ఉండటంతో సిరీస్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. మంగళవారం ముంబైలోని వాంఖేడే స్టేడియంలో తొలి వన్డే జరుగనుంది. కాగా, ఈ సిరీస్‌లో సత్తాచాటుతానని అంటున్నాడు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అలెక్స్ క్యారీ. ఈ క్రమంలోనే భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోనిపై క్యారీ ప్రశంసలు కురిపించాడు. తాను కూడా ధోనిలా అత్యుత్తమ మ్యాచ్ ఫినిషర్ కావాలని ఉందని మనసులోని మాటను వెల్లడించాడు. ‘ నాకు ధోనిలా కావాలని ఉంది. మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్‌లో ఎక్కడైనా బ్యాటింగ్ చేసే నైపుణ్యం నాలో ఉంది.
కానీ బ్యాటింగ్ చేసే క్రమంలో ఇంకా మెరుగుపడాల్సి ఉంది. ఆస్ట్రేలియాకు ఒక ఫినిషర్‌గా మారడం కోసం యత్నిస్తున్నా. ఒక్కసారి ఎంఎస్ ధోనిని చూడండి. ప్రపంచ క్రికెట్‌లో ధోని ఎంత అత్యుత్తమ ఫినిషర్ అనే విషయం మనకు తెలుసు. ప్రతీ ఒక్కరూ అతన్ని ఆదర్శంగా తీసుకుంటారనేది కాదనలేని వాస్తవం. ఇందులో నేను కూడా ఉన్నా. గతేడాది ధోనితో కలిసి చాలా ఎక్కువ క్రికెట్‌ను ఆస్వాదించడం నా అదృష్టం. భారత్‌తో వారి దేశంలో ఆడటం చాలా కష్టం. ఆ జట్టులో బుమ్రా, షమీ వంటి నాణ్యమైన బౌలర్లు ఉన్నారు. ఇక టీమిండియా స్పిన్ గురించి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆస్ట్రేలియా విజయాల బాటలో పయనిస్తోంది. దాంతో ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో నా అత్యుత్తమ ఆటను ఇవ్వడానికి యత్నిస్తా. నేను ఈ సిరీస్‌లో ఆడితే టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. కానీ దాని గురించి పెద్దగా ఆలోచించడం లేదు’ అని క్యారీ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment