‘ఖేల్రత్న’ సానియా
- అధికారికంగా అవార్డు ప్రకటించిన కేంద్రప్రభుత్వం
- శ్రీకాంత్, అనూప్, రోహిత్ సహా 17 మందికి అర్జున
న్యూఢిల్లీ: భారత మహిళా టెన్నిస్‌కు పుష్కర కాలంకు పైగా ముఖచిత్రంగా మారిన సానియా మీర్జా ఉజ్వల కెరీర్‌లో ఇప్పుడు మరో నగ చేరింది. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు హైదరాబాదీ సానియా ఎంపికైంది. శుక్రవారం ప్రభుత్వం దీనిని అధికారికంగా ప్రకటించింది. పేస్ తర్వాత ఈ అవార్డు అందుకోనున్న రెండో టెన్నిస్ ప్లేయర్ సానియా. కెరీర్‌లో మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో మూడు, డబుల్స్‌లో ఒక గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన సానియా అంతర్జాతీయ సర్క్యూట్‌లో గత ఏడాది కాలంగా హవా కొనసాగిస్తోంది. 2014 చివర్లో డబ్ల్యూటీఏ ఫైనల్స్ నెగ్గి సంచలనం సృష్టించిన మీర్జా...ఈ ఏడాది ఏప్రిల్ రెండో వారంలో వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌కు కూడా చేరుకొని అందనంత ఎత్తులో నిలిచింది.
ఈ ప్రదర్శనను ఇప్పుడు ప్రభుత్వం గుర్తించింది. అవార్డుల కమిటీలో ఎలాంటి విభేదాలకు తావు లేకుండా ఏకగ్రీవంగా ఆమె ఎంపిక జరిగిందంటే సానియా ఆటతీరు ఎలా ఉందో తెలుస్తుంది. గతంలోనే ప్రభుత్వంనుంచి అర్జున, పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న 29 ఏళ్ల ఈ టెన్నిస్ స్టార్ ఇప్పుడు దేశంలోని అత్యున్నత క్రీడా అవార్డుకు ఎంపికైంది. ప్రస్తుతం ఆమె తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తోంది.
అందరికీ ఆమోదముద్ర
మరో వైపు 17 మంది ఆటగాళ్లకు అర్జున పురస్కారాలు దక్కనున్నాయి. అవార్డుల కమిటీ ఎంపిక చేసిన జాబితాలో ఎలాంటి మార్పులూ లేకుండా ప్రభుత్వం దీనిని ఆమోదించింది. గతంలో కొన్ని సందర్భాల్లో జరిగినట్లుగా ఈ సారి అవార్డుల విషయంలో ఎలాంటి వివాదం లేకపోవడం విశేషం. హైదరాబాద్ బ్యాడ్మింటన్ సంచలనం కిడాంబి శ్రీకాంత్, అంతర్జాతీయ స్కేటర్ అనూప్ యామాలు అర్జున జాబితాలో ఉన్నారు. బ్యాడ్మింటన్‌లో గత ఏడాది టాప్ ఆటగాడు లిన్ డాన్‌ను ఓడించి చైనా ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ గెలుచుకున్న శ్రీకాంత్ ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు.
ఆ తర్వాత వరల్డ్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి కూడా ఎగబాకాడు. స్కేటింగ్‌లో ఎలాంటి ప్రోత్సాహం దక్కకపోయినా కఠోర శ్రమతో అనూప్ యామా పలు పతకాలు గెలుచుకున్నాడు. గత ఏడాది ప్రపంచ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించడం అతనికి ‘అర్జున’ అవకాశం కల్పించింది. వన్డే క్రికెట్‌లో రెండు డబుల్ సెంచరీలతో సంచలనం సృష్టించిన రోహిత్ శర్మతో పాటు భారత హాకీ జట్టులో నిలకడగా రాణిస్తున్న గోల్‌కీపర్ శ్రీజేశ్‌లకు కూడా అర్జున గౌరవం లభించనుంది. ఈ నెల 29న ధ్యాన్‌చంద్ జయంతిన జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వీటిని అందజేస్తారు.
ఇదో గొప్ప గౌరవం. దేశం నాపై కురిపించిన ప్రేమాభిమానాలకు సంతోషంగా ఉంది. ఈ అవార్డు స్ఫూర్తితో దేశానికి మరింత గౌరవం పెంచే విజయాలు సాధిస్తాను. సహచర భారతీయులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
అభినందనల వెల్లువ
ఖేల్త్న్రకు ఎంపికైన తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియాను, స్కేటర్ అనూప్ యామాను రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అభినందించారు. ఏపీ సీఎం చంద్రబాబు సానియాకు అభినందనలు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి కూడా సానియాకు అభినందనలు తెలిపారు. అర్జున అవార్డుకు ఎంపికైన తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు యామా, శ్రీకాంత్‌లను కూడా జగన్‌మోహన్ రెడ్డి అభినందించారు.