స్టీవ్ స్మిత్.. మార్గాలు వెతుకు: క్లార్క్
కోల్కతా:ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ గా స్టీవ్ స్మిత్ అసలైన సవాల్ను ఎదుర్కొనే సమయం ఆసన్నమైందని ఆ దేశ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ స్పష్టం చేశాడు. ఈ క్రమంలోనే రాబోయే కొన్ని నెలలు ఆస్ట్రేలియా జట్టుకు కూడా ముఖ్యమేనన్నాడు. ప్రస్తుతం ఆసీస్ జట్టును విజయాల బాట పట్టించడానికి స్మిత్ మార్గాలు కనుగోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నాడు. గత కొంతకాలంగా బ్యాట్స్మన్ గా ఆసీస్కు వెన్నుముక నిలుస్తున్న స్మిత్ పై సందేహాలు లేకపోయినప్పటికీ కెప్టెన్ గా మరింత బాధ్యత తీసుకోవాలని క్లార్క్ సూచించాడు.
'ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆసీస్ ను విజయాల బాట పట్టించడం స్మిత్ మొదటి బాధ్యత. జట్టులో ఆత్మవిశ్వాసం రావాలంటే గెలుపుకు మార్గాలు వెతకాలి. నా దృష్టిలో విరాట్ కోహ్లి(భారత కెప్టెన్)-స్టీవ్ స్మిత్లే వరల్డ్ అత్యుత్తమ ఆటగాళ్లు. కాకపోతే ఆసీస్ విజయాల కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది. ఆసీస్ ను విజయాలవైపు నడిపించడమే స్మిత్ ముందున్న సవాల్'అని క్లార్క్ పేర్కొన్నాడు.ఈడెన్ గార్డెన్ లో జరిగే రెండో వన్డేలో ఆసీస్ విజయం సాధిస్తే కనుక 3-2 తో సిరీస్ ను గెలుచుకోవడం ఖాయమని క్లార్క్ జోస్యం చెప్పాడు. ఒకవేళ ఆ మ్యాచ్ లో ఓడిపోతే ఏమి జరుగుతుందనే దానిపై అంచనా వేయలేనన్నాడు.