చండిమల్ సెంచరీ
లంక 338 ఆలౌట్ ∙బంగ్లా 214/5
కొలంబో: దినేశ్ చండిమల్ సెంచరీ (300 బంతుల్లో 138, 10 ఫోర్లు, ఓ సిక్సర్)తో కదం తొక్కడంతో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండోటెస్టులో శ్రీలంక 338 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 238/7తో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన లంక మరో 100 పరుగులు జత చేసి ఆలౌటైంది. చండిమల్ ఓపికగా బ్యాటింగ్ చేసి జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. కెప్టెన్ రంగన హెరాత్ (25), సురంగ లక్మల్ (35) అతనికి సహకరించారు. ముందుగా హెరాత్‌తో ఎనిమిదో వికెట్‌కు 55, లక్మల్‌తో తొమ్మిదో వికెట్‌కు 55 పరుగులు జోడించాడు. ఈక్రమంలో చండిమల్ టెస్టుల్లో ఎనిమిదో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చివర్లో లక్మల్ పోరాడడంతో లంక మరిన్ని పరగులు సాధించింది.
బౌలర్లలో మెహ్‌దీ హసన్ మిరాజ్‌కు మూడు, సుభాశిష్ రాయ్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షకీబల్ హసన్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బంగ్లా రెండోరోజు ఆటముగిసేసరికి 60 ఓవర్లలో ఐదు వికెట్లకు 214 పరుగులు చేసింది. జట్టులో సౌమ్యాసర్కార్ (61) సిరీస్‌లో వరుసగా మూడో అర్ధసెంచరీని నమోదు చేశాడు. తమీమ్ ఇక్బాల్ (49), షబ్బీర్ రహ్మాన్ (42) ఫర్వాలేదనిపంచారు.తొలుత ఓపెనర్లు 95 పరుగుల జోడించి శుభారంభాన్నించ్చినా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ విఫలమవడంతో బంగ్లా త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో షకీబల్ హసన్ (18), ముష్ఫికుర్ రహీమ్ (2) క్రీజులో ఉన్నారు. ప్రత్యర్థి కంటే బంగ్లా మరో 124 పరుగుల వెనుకంజలో ఉంది. లంక బౌలర్లలో సందకన్‌కు మూడు వికెట్లు దక్కాయి.