చెన్నైతో మ్యాచ్‌లో పంజాబ్ విజయ లక్ష్యం 161 పరుగులు. ఒక దశలో జట్టు విజయానికి 49 బంతుల్లో 71 పరుగులు అవసరం. ఈ స్థితిలో పంజాబ్ గెలిచేస్తుందనే అనుకున్నారంతా... కానీ చెన్నై స్పిన్నర్లు జడేజా, హర్భజన్, తాహిర్ చెలరేగారు. దాదాపు 6 ఓవర్ల పాటు పంజాబ్‌ను ఒక్క బౌండరీ కూడా బాదకుండా అడ్డుకున్నారు. దీంతో విజయ సమీకరణం 16 బంతుల్లో 44గా మారగా, ఛేదన పంజాబ్ వల్ల కాలేదు. రాహుల్, సర్ఫరాజ్ నెమ్మదైన అర్ధసెంచరీలతో జట్టు మూల్యం చెల్లించుకోగా, ధోని వ్యూహాలతో చెన్నైకి మరో విజయం దక్కింది.
చెన్నై: సొంతగడ్డపై సమష్టిగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. శనివారం చేపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సూపర్‌కింగ్స్ 22 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌పై ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 160 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (38 బంతుల్లో 54; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో అదరగొట్టాడు. కెప్టెన్ ధోని (23 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 138 పరుగులే చేయగలిగింది. రాహుల్ (47 బంతుల్లో 55; 3 ఫోర్లు, 1 సిక్స్), సర్ఫరాజ్ ఖాన్ (59 బంతుల్లో 67; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాటం వృథా అయింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ హర్భజన్, కుగ్లీన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
సాదాసీదాగా...
డు ప్లెసిస్, వాట్సన్ తొలి వికెట్‌కు 56 పరుగులు జోడించి చెన్నైకి శుభారం భం అందించారు. టై బౌలింగ్‌లో వరుసగా 4, 6 బాదిన వాట్సన్ పవర్ ప్లే చివరి బంతికి మరో బౌండరీతో జోరు కనబరిచాడు. తర్వాత మరో భారీ షాట్ ఆడే క్రమంలో అశ్విన్‌కు దొరికిపోయాడు. రైనా (17) సింగిల్స్‌కే ప్రా ధాన్యతనిచ్చాడు. మరోవైపు మురుగన్, అశ్విన్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో స్కోరు వేగం తగ్గింది. సగం ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై 71/1తో నిలిచింది. వరుస బంతుల్లో డు ప్లెసిస్, రైనాలను ఔట్ చేసి అశ్విన్ స్కోరును కట్టడి చేశాడు. అనంతరం రాయుడు (15 బంతుల్లో 21 నాటౌ ట్; 1 ఫోర్, 1 సిక్స్), చివర్లో ధోని బ్యాట్ ఝళిపించారు. కరన్ వేసిన 19వ ఓవర్లో 6, 4, 4తో ధోని 19 పరుగులు రాబట్టాడు. చివరి ఓవర్‌లో రాయు డు సిక్స్, ధోని బౌండరీ బాదడంతో స్కోరు 150 పరుగులు దాటింది.
డుప్లెసిస్ జోరు
ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతోన్న ఫాఫ్ డు ప్లెసిస్.... షమీ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లతో చెలరేగాడు. అదే ఓవర్ చివరి బంతిని ఫైన్ లెగ్ మీదుగా భారీ సిక్సర్‌గా మలిచాడు. టై ఓవర్‌లోనూ లాంగాన్ మీదుగా మరో సిక్సర్‌తో అలరించాడు. ఆరంభంలో స్పిన్ ఎదుర్కొనేందుకు కాస్త తడబడిన అతను... అశ్విన్, మురుగన్ వేసిన వరుస ఓవర్లలో రెండు సిక్సర్లతో జోరు కనబరిచాడు. ఇదే క్రమంలో 33 బంతుల్లో అర్ధసెంచరీని అందుకున్నాడు. తర్వాత అశ్విన్ బౌలింగ్‌లో మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
అతి జాగ్రత్తకు పోయి..
ఒకే ఓవర్‌లో విధ్వంసక ఆటగాడు గేల్ (5), మయాంక్ అగర్వాల్ (0)లను ఔట్ చేసి హర్భజన్ పంజాబ్‌కు షాకిచ్చాడు. అయితే రాహుల్, సర్ఫరాజ్ జోడీ జట్టును ఆదుకుంది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 110 పరుగులు జోడించారు. చహర్ వేసిన నాలుగో ఓవర్‌లో రాహుల్ 4, 6, 4తో అలరించాడు. తొలిసారి ఐపీఎల్ ఆడుతోన్న కుగ్లీన్ తన మొదటి బంతినే సర్ఫరాజ్‌కు సిక్స్‌గా సమర్పించుకున్నాడు. దీంతో పవర్‌ప్లేలో పంజాబ్ 2 వికెట్లకు 48 పరుగులు చేసింది. మరోసారి కుగ్లీన్ బౌలింగ్ (12వ ఓవర్)లోనే సర్ఫరాజ్ 4, 6తో అలరించాడు. అప్పటివరకు సాఫీగా సాగిన పంజాబ్ ఇన్నింగ్స్ బ్యాట్స్‌మెన్ అతి జాగ్రత్తతో డీలా పడింది.
Comments
Please login to add a commentAdd a comment