సాధించెన్నై... | Chennai Super Kings to third IPL title | Sakshi
Sakshi News home page

సాధించెన్నై...

Published Mon, May 28 2018 4:09 AM | Last Updated on Mon, May 28 2018 8:41 AM

Chennai Super Kings to third IPL title - Sakshi

రిటర్న్‌ ఆఫ్‌ సూపర్‌ కింగ్స్‌... పునరాగమనం అంటే ఎంత ఘనంగా ఉండాలో చెన్నై నిరూపించింది. వివాదంతో లీగ్‌కు రెండేళ్లు దూరమై, వేలంలో మూడు పదుల ఆటగాళ్లతో అంకుల్స్‌ జట్టుగా ముద్ర పడి, సీజన్‌లో సొంతగడ్డపై ఒక్క మ్యాచ్‌కే పరిమితమై కూడా ఆ జట్టు అద్భుతాన్ని చేసింది. తమకే సాధ్యమైన రీతిలో విజయయాత్ర కొనసాగించి మూడోసారి ఐపీఎల్‌ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. నాయకుడిగా తనేమిటో మళ్లీ మళ్లీ చూపించిన ధోని మార్గనిర్దేశనంలో, మదరాసీల అభిమాన జనం ప్రోత్సాహంతో విజిల్‌ పొడు అంటూ గెలుపు ఈల వేసింది.


తొలి 10 బంతుల్లో 0 పరుగులు... ఒక టి20 మ్యాచ్‌లో ఇంతటి చెత్త ఆరంభం ఏ బ్యాట్స్‌మన్‌ కూడా చేసి ఉండడు. కానీ షేన్‌ వాట్సన్‌ అలాగే ఆడాడు. కానీ ఆ తర్వాత అతను వీర విధ్వంసం సృష్టించాడు. తర్వాతి 47 బంతుల్లోనే 11 ఫోర్లు, 8 సిక్సర్లతో ఏకంగా 117 పరుగులు బాది చెన్నైని విజేతగా నిలిపాడు. ప్రధాన బౌలర్లు భువనేశ్వర్‌ (0/17), రషీద్‌ (0/24)లను జాగ్రత్తగా ఆడి మిగిలిన బౌలర్లపై విరుచుకుపడాలనుకున్న చెన్నై వ్యూహం అద్భుతంగా పని చేసింది. ఫలితంగా తుది పోరు ఏకపక్షంగా మారిపోయి ఈ సీజన్‌లో రైజర్స్‌పై చెన్నై స్కోరు 4–0గా మారిపోయింది.


బలమైన బౌలింగ్‌ అండగా, కెప్టెన్‌ విలియమ్సన్‌ బ్యాటింగ్‌ ముందుండి నడిపించగా... ఫైనల్‌ వరకు చేరిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తుది పోరులో మాత్రం చేతులెత్తేసింది. చిన్న మైదానమైన వాంఖెడేలో ముందుగా భారీ స్కోరు చేయడంలో తడబడిన ఆ జట్టు లక్ష్యాన్ని కాపాడుకోవడంలో కూడా విఫలమైంది. ఈ సీజన్‌లో అతి స్వల్ప స్కోర్లను కూడా రక్షించుకోగలిగిన జట్టుకు తుది పోరులో మాత్రం అది సాధ్యం కాలేదు. అసలు మ్యాచ్‌లో సందీప్‌ శర్మ, సిద్ధార్థ్‌ కౌల్‌ బౌలింగ్‌ వైఫల్యం రైజర్స్‌ను దెబ్బ తీసింది. విలియమ్సన్‌ స్ఫూర్తిదాయక నాయకత్వం జట్టును ఫైనల్‌ వరకు చేర్చినా చివరకు నిరాశ తప్పలేదు

 
ముంబై: మహేంద్ర సింగ్‌ ధోని నాయకత్వంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరోసారి ఐపీఎల్‌లో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో చెన్నై 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. కేన్‌ విలియమ్సన్‌ (36 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), యూసుఫ్‌ పఠాన్‌ (25 బంతుల్లో 45 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం చెన్నై 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఐపీఎల్‌ ఫైనల్లో ఛేదనలో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా వాట్సన్‌ గుర్తింపు పొందగా, సురేశ్‌ రైనా (24 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్‌) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 57 బంతుల్లోనే 117 పరుగులు జోడించడం విశేషం.  

పఠాన్, బ్రాత్‌వైట్‌ మెరుపులు...
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ ఆరంభంలోనే గోస్వామి (5) వికెట్‌ కోల్పోయింది. లేని రెండో పరుగు తీసే ప్రయత్నంలో అతను ఔటయ్యాడు. ఇన్‌గిడి మెయిడిన్‌ వేయడంతో తొలి 4 ఓవర్లు ముగిసేసరికి జట్టు 17 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే చహర్‌ వేసిన ఐదో ఓవర్లో విలియమ్సన్‌ 6, 4 కొట్టి జోరు పెంచాడు. ఆ తర్వాత బ్రేవో బౌలింగ్‌లోనూ విలియమ్సన్‌ వరుస బంతుల్లో 4, 6 బాదాడు. మరోవైపు శిఖర్‌ ధావన్‌ (25 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కొన్ని చక్కటి షాట్లతో అలరించాడు. అయితే జడేజా తొలి ఓవర్లోనే ధావన్‌ బౌల్డ్‌ కావడంతో 51 పరుగుల రెండో వికెట్‌ (40 బంతుల్లో) భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో కెప్టెన్, షకీబ్‌ (23; 2 ఫోర్లు, 1 సిక్స్‌) వేగంగా ఆడారు.

జడేజా ఓవర్లో వీరిద్దరు 2 ఫోర్లు, సిక్స్‌తో 17 పరుగులు రాబట్టారు. బ్రేవో ఓవర్లో మళ్లీ రెండు ఫోర్లు కొట్టి దూసుకుపోతున్న విలియమ్సన్‌కు ఎట్టకేలకు కరణ్‌ శర్మ బ్రేక్‌ వేశాడు. దూరంగా వెళుతున్న బంతిని ముందుకొచ్చి ఆడే ప్రయత్నంలో అతను స్టంపౌటయ్యాడు. అయితే దూకుడు తగ్గనివ్వని షకీబ్, పఠాన్‌ 22 బంతుల్లో 32 పరుగులు జత చేశా రు. రైనా అద్భుత క్యాచ్‌కు షకీబ్‌ వెనుదిరగ్గా, హుడా (3) విఫలమయ్యాడు. ఈ దశలో పఠాన్, బ్రాత్‌వైట్‌ బ్యాటింగ్‌ దూకుడు రైజర్స్‌కు మెరుగైన స్కోరు అందించింది. వీరిద్దరు భారీ షాట్లతో 18 బంతుల్లోనే 34 పరుగులు జోడించారు. తొలి 10 ఓవర్లలో 73 పరుగులు సాధించిన హైదరాబాద్‌... తర్వాతి 10 ఓవర్లలో 105 పరుగులు చేయడం విశేషం.


 
భారీ భాగస్వామ్యం...
ఛేదనను చెన్నై చాలా నెమ్మదిగా ప్రారంభించింది. భువనేశ్వర్‌ తొలి ఓవర్‌ను మెయిడిన్‌ వేయగా... కుదురుకునేందుకు వాట్సన్‌ చాలా సమయం తీసుకున్నాడు. ఇదే ఒత్తిడిలో డు ప్లెసిస్‌ (10) వెనుదిరగడంతో జట్టు తొలి వికెట్‌ కోల్పోయింది. అయితే వాట్సన్, రైనా కలిసి ప్రశాంతంగా ఇన్నింగ్స్‌ను నడిపించారు. సందీప్‌ ఓవర్లో వరుసగా 6, 4 బాది తొలిసారి టచ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత అతడిని ఆపడం సన్‌రైజర్స్‌ వల్ల కాలేదు. కౌల్‌ తన తొలి ఓవర్లో 16 పరుగులు సమర్పించుకోవడంతో చెన్నై జోరు మొదలైంది. 10 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 80 పరుగులకు చేరింది. తర్వాతి రెండు ఓవర్లలో  రెండు సిక్సర్ల సహాయంతో చెన్నై 24 పరుగులు రాబట్టింది. అనంతరం సందీప్‌ శర్మ వేసిన ఓవర్లో ఏకంగా 27 పరుగులు రావడంతో సూపర్‌ కింగ్స్‌ విజయం దాదాపుగా ఖాయమైంది. రైనా ఔటైనా... 51 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం వాట్సన్‌ చివరి వరకు నిలిచాడు. అతనికి రాయుడు (16 నాటౌట్‌) సహకరించడంతో 9 బంతులు మిగిలి ఉండగానే విజయం పూర్తయింది.
 
ఆ ఓవర్‌...
సందీప్‌ శర్మ 13వ ఓవర్‌ వేయడానికి ముందు చెన్నై లక్ష్యం 48 బంతుల్లో 75 పరుగులు. ఒకటి, రెండు వికెట్లు పడితే ఒత్తిడి పెరిగే అవకాశం ఉండేది. కానీ వాట్సన్‌ వరుస బంతుల్లో 4, 6, 6, 6, 4 బాదడంతో మ్యాచ్‌ చెన్నై వైపు పూర్తిగా మళ్లింది. మరో వైడ్‌తో కలిసి ఈ ఓవర్లో సందీప్‌ 27 పరుగులిచ్చాడు.

స్కోరు వివరాలు
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: శ్రీవత్స్‌ గోస్వామి రనౌట్‌ 5; ధావన్‌ (బి) జడేజా 26; విలియమ్సన్‌ (స్టంప్డ్‌) ధోని (బి) కరణ్‌ శర్మ 47; షకీబ్‌ (సి) రైనా (బి) బ్రేవో 23; యూసుఫ్‌ పఠాన్‌ నాటౌట్‌ 45; దీపక్‌ హుడా (సి) సబ్‌–షోరే (బి) ఇన్‌గిడి 3; బ్రాత్‌వైట్‌ (సి) రాయుడు (బి) శార్దుల్‌ ఠాకూర్‌ 21; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 178.  
వికెట్ల పతనం: 1–13, 2–64, 3–101, 4–133, 5–144, 6–178.
బౌలింగ్‌: చహర్‌ 4–0–25–0, ఇన్‌గిడి 4–1–26–1, శార్దుల్‌ ఠాకూర్‌ 3–0–31–1, కరణ్‌ శర్మ 3–0–25–1, బ్రేవో 4–0–46–1, జడేజా 2–0–24–1.
చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: వాట్సన్‌ నాటౌట్‌ 117; డు ప్లెసిస్‌ (సి అండ్‌ బి) సందీప్‌ శర్మ 10; రైనా (సి) గోస్వామి (బి) బ్రాత్‌వైట్‌ 32; రాయుడు నాటౌట్‌ 16; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.3 ఓవర్లలో 2 వికెట్లకు) 181.  
వికెట్ల పతనం: 1–16, 2–133.  
బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–1–17–0, సందీప్‌ శర్మ 4–0–52–1, సిద్ధార్థ్‌ కౌల్‌ 3–0–43–0, రషీద్‌ ఖాన్‌ 4–1–24–0, షకీబ్‌ 1–0–15–0, బ్రాత్‌వైట్‌ 2.3–0–27–1.   


‘మేం చేసిన స్కోరు గెలిచేందుకు సరిపోతుందని భావించినా ఆ తర్వాత పిచ్‌ మారిపోయింది. తొలి 5–6 ఓవర్లతో పాటు మ్యాచ్‌లో చాలా భాగం ముందంజలోనే ఉన్నాం. కానీ వాట్సన్‌ అంతా మార్చేశాడు. సీజన్‌ మొత్తం బాగా ఆడి ఇలా ఓడిపోవడం నిరాశగా ఉంది. మా కుర్రాళ్లు చాలా బాధపడుతున్నారు. అయితే మేం గెలవకపోయినా బాగా పోరాడాం. నాణ్యమైన బౌలింగ్‌ వనరులు ఉండటం అదృష్టం. అయితే వెనుదిరిగి చూస్తే కొన్ని గుర్తుంచుకునే క్షణాలు ఉన్నా చివరకు ఓటమే దక్కింది. బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా బాధ్యతగా రాణించడం సంతృప్తిగా ఉంది. జట్టు ఫైనల్‌ చేరడం సమష్టి కృషిగానే భావిస్తా’         
 – కేన్‌ విలియమ్సన్‌ 

                  



‘రషీద్‌లాగే భువనేశ్వర్‌ కూడా చాలా తెలివైన బౌలర్‌. కాబట్టి ప్రత్యర్థి జట్టులో మమ్మల్ని ఇబ్బందిపెట్టేవారు ఒకరికంటే ఎక్కువే ఉన్నారు. మా బ్యాటింగ్‌ చాలా బాగా సాగింది. బలమైన మిడిలార్డర్‌ను నమ్ముకున్నాం. ప్రతీ విజయం ప్రత్యేకమే. ఏ ఒక్కటో గొప్పదని చెప్పలేను. నా దృష్టిలో వయసనేది ఒక అంకె మాత్రమే. 33 ఏళ్ల రాయుడు మా ప్రధాన బ్యాట్స్‌మన్‌. 19–20 ఏళ్ల కుర్రాళ్లు కాకపోయినా మైదానంలో చురుగ్గా ఉండగలవాళ్లే కావాలి. మాకు వయసుకంటే మా ఆటగాళ్ల గురించి, వారి ఫిట్‌నెస్‌ గురించి చక్కటి అవగాహన ఉంది కాబట్టి దానికి తగినట్లుగా వ్యూహాలు రూపొందించాం. గెలిచినా, ఓడినా చెన్నై వెళ్లి అభిమానులను కలుసుకోవాలని ముందే నిర్ణయించుకున్నాం. ఇప్పుడు కప్‌తో చెన్నైకి తిరిగి వెళుతున్నాం.’               
– ఎమ్మెస్‌ ధోని   




(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement