
అర్జెంటీనాకు చిలీ సవాల్
షికాగో: డిఫెండింగ్ చాంపియన్ చిలీ కోపా అమెరికా కప్ ఫుట్బాల్ టోర్నీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో కొలంబియాపై 2-0తో విజయం సాధించింది. ప్రతికూల వాతావరణం కారణంగా దాదాపు రెండు గంటలు ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది. మ్యాచ్ ఆరంభం నుంచి చిలీ పూర్తి ఆధిప్యతం కనబరిచింది. చిలీ ఆటగాళ్లు చార్లెస్ అరాంగ్విజ్, జోస్, ఫుంజాలిండా గోల్స్ సాధించారు.
ఆదివారం జరిగే ఫైనల్లో అర్జెంటీనాతో చిలీ తలపడుతుంది. గతేడాది కూడా ఈ రెండు జట్టే ఫైనల్ కు వచ్చాయి. అర్జెంటీనాను 4-1తో ఓడించి తొలిసారిగా చిలీ కోపా కప్ ను ఎగరేసుకుపోయింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్స్ చేయలేకపోవడంతో పెనాల్టీ షూటవుట్ ద్వారా విజేతను నిర్ణయించారు. పెనాల్టీ షూటవుట్ లో చిలీ గోల్స్ చేయగా, అర్జెంటీనా ఒక గోల్ మాత్రమే చేసింది. ఈసారి చిలీని ఓడించి గతేడాది ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని మెస్సీ సేన భావిస్తోంది. డిఫెండింగ్ చాంపియన్ హోదా నిలబెట్టుకోవాలని చిలీ ప్రయత్నిస్తోంది.