ఫుజౌ (చైనా): ప్రపంచ చాంపియన్‌గా అవతరించాక ఆడిన ప్రతీ టోర్నీలో నిరాశపరిచిన భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు... ఈ ఏడాది లోటుగా ఉన్న ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్ సూపర్ టైటిల్‌ను సాధించేందుకు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. నేటి నుంచి మొదలయ్యే చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో సింధుతోపాటు భారత్‌కే చెందిన మరో స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్‌లో బరిలోకి దిగనున్నారు. ఇద్దరికీ క్లిష్టమైన ‘డ్రా’నే ఎదురైంది. ప్రపంచ చాంపియన్ అయ్యాక సింధు చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీతోపాటు కొరియా ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీల్లో పాల్గొంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన ఆమె మిగతా మూడు టోర్నీల్లో ప్రిక్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయింది.
మంగళవారం మొదలయ్యే చైనా ఓపెన్‌లోనూ సింధుకు కఠిన పరీక్ష ఎదురుకానుంది. తొలి రౌండ్‌లో పాయ్ యు పో (చైనీస్ తైపీ)తో ఆడనున్న సింధు ఈ రౌండ్‌ను దాటితే ప్రిక్వార్టర్ ఫైనల్లో కిర్‌స్టీ గిల్మోర్ (స్కాట్లాండ్) లేదా కిమ్ గా యున్ (దక్షిణ కొరియా)లతో తలపడుతుంది. ఈ అడ్డంకిని అధిగమిస్తే సింధుకు క్వార్టర్ ఫైనల్లో రియో ఒలింపిక్స్ చాంపియన్, మూడుసార్లు విశ్వవిజేతగా నిలిచిన కరోలినా మారిన్ (స్పెయిన్) లేదా ప్రపంచ రెండో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) ఎదురవుతారు. ముఖాముఖి రికార్డులో సింధుపై వీరిద్దరికి మెరుగైన రికార్డు ఉంది. మరోవైపు సైనా నెహ్వాల్ తొలి రౌండ్‌లో చైనా ప్లేయర్ కాయ్ యాన్ యాన్‌తో తలపడుతుంది. తొలి రౌండ్‌లో గెలిస్తే సైనాకు ప్రిక్వార్టర్ ఫైనల్లో బుసానన్ (థాయ్‌లాండ్) లేదా లైన్ జార్స్‌ఫెల్ట్ (డెన్మార్క్) ఎదురయ్యే చాన్స్ ఉంది. ఈ రౌండ్‌నూ దాటితే క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ అకానె యామగుచి (జపాన్) రూపంలో సైనాకు కఠిన ప్రత్యర్థి ఉండే అవకాశముంది.
వైదొలిగిన శ్రీకాంత్...
పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ వైదొలగగా... ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్, సమీర్ వర్మ, హెచ్‌ఎస్ ప్రణయ్‌లు బరిలో ఉన్నారు. తొలి రౌండ్ పోరులో టామీ సుగియార్తో (ఇండోనేసియా)తో సాయిప్రణీత్; సిత్తికోమ్ తమాసిన్ (థాయ్‌లాండ్)తో కశ్యప్; లీ చియుక్ యు (హాంకాంగ్)తో సమీర్ వర్మ; రాస్ముస్ గెమ్‌కే (డెన్మార్క్)తో ప్రణయ్ తలపడతారు.
Comments
Please login to add a commentAdd a comment