
బాసెటెర్ (వెస్టిండీస్): వెస్టిండీస్ విధ్వంసకర క్రికెటర్ క్రిస్ గేల్ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో గేల్(73; 66 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించాడు. ఈ మ్యాచ్‌లో ఐదో సిక్సర్‌ను సాధిండం ద్వారా గేల్ తన కెరీర్‌లో 476వ సిక్సర్‌ను నమోదు చేశాడు.
ఫలితంగా ఆఫ్రిది(476 సిక్సర్లు) అత్యధిక సిక్సర్ల రికార్డును గేల్ సమం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో ఆఫ్రిది, గేల్ తర్వాత బ్రెండన్ మెకల్లమ్(398), సనత్ జయసూర్య(352), ఎంఎస్ ధోని(342), ఏబీ డివిలియర్స్(328), రోహిత్ శర్మ(291), మార్టిన్ గప్టిల్(274), సచిన్ టెండూల్కర్(264)లు ఉన్నారు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా తొమ్మిదేళ్ల తర్వాత వెస్టిండీస్ గడ్డపై బంగ్లాదేశ్ సిరీస్ గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment