క్రిస్ గేల్ ఆడతాడా?
అహ్మదాబాద్: ఐపీఎల్-8లో భాగంగా శుక్రవారం రాత్రి జరగనున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. పాయింట్ల పట్టిక అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్ జోరు కొనసాగించాలని భావిస్తుండగా, మలి విజయం కోసం బెంగళూరు సర్వశక్తులు ఒడ్డనుంది.
ఈ సీజన్ లో రాజస్థాన్ ఇప్పటివరకు 6 మ్యాచ్ లు ఆడి ఐదింట్లో విజయం సాధించింది. 4 మ్యాచ్ లు ఆడిన కోహ్లి సేన ఒక్క విజయం మాత్రమే అందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ కు దూరమైన డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ ఈ రోజు ఆడతాడో, లేదో వెల్లడి కాలేదు. గాయం కారణంగా గేల్ గత మ్యాచ్ లో ఆడలేకపోయాడని వచ్చిన వార్తలను బెంగళూరు ఆటగాళ్లు తోసిపుచ్చారు.
మరో విధ్వంసకర ఆటగాడు డివిలియర్స్ కూడా తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. గత మ్యాచ్ లో ఆడిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఇక అన్ని విభాగాల్లో రాణిస్తున్న రాజస్థాన్ వరుస విజయాలతో దూసుకెళ్తుతోంది. ఇప్పటివరకు ఈ రెండు టీమ్ లు 13 మ్యాచుల్లో ముఖాముఖి తలపడగా రాజస్థాన్ 7, బెంగళూరు 6 విజయాలు అందుకున్నాయి.