అరేబియా తీరంలో కరీబియన్ విధ్వంసం
ముంబై: అదేబియా తీరంలో కరీబియన్ వీరుడు విధ్వంసం సృష్టించాడు. గత కొద్దికాలంగా ఆటతీరుకంటే వరుస వివాదాలతోనే వార్తల్లో నిలిచిన వెస్టిండీస్ తురుపుముక్క క్రిస్ గేల్ మళ్లీ తన ప్రతాపాన్ని చాటుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా బుధవారం ముంబైలో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 11 సిక్స్ లు, 5 ఫోర్లు బాది ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించడమే కాక అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ల్లో రెండు సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతకు ముందు మెకల్లం ఒక్కడే టీ20ల్లో రెండు సాధించాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన గేల్ 48 బంతుల్లో 100 పరుగులు సాధించి విండీస్ ను విజయతీరాలకు చేర్చాడు.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకుంటూ.. వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ నెగ్గటం సంతోషంగా ఉందని, ఈ రోజు రాత్రి బీర్లు పొంగటం ఖాయమని గేల్ అన్నాడు. ఇంగ్లాడ్ నిర్దేశించిన 182 పరుగుల టార్గెట్ కష్టసాధ్యమైనదే అయినప్పటికీ వికెట్ కాపాడుకుంటూ జాగ్రత్తగా ఆడే ప్రయత్నం చేశానని గేల్ వివరించాడు. విండీస్ సారధి స్యామి మాట్లాడుతూ ఇంగ్లాడ్ ను 200 లోపే కట్టడిచేయడంతో గెలుపుపై నమ్మకం పెరిగిందని, అయితే గేల్ దుమారం వల్ల అది సులువుగా సాధ్యపడిందన్నాడు.
2006 నుంచి ఇప్పటి వరకు 46 అంతర్జాతీయ టీ20లు ఆడిన క్రిస్ గేల్ 44 ఇన్నింగ్స్ ల్లో 37.65 సగటుతో 1506 పరుగులు చేశాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో గేల్ ది ఎనిమిదో స్థానం. అయితే అత్యధిక సిక్సర్ల మోతలో మాత్రం గేల్ ను మించిన మొనగాడు లేడు. ఇప్పటివరకు గేల్ 98 సిక్స్ లు బాది.. సిక్సర్ల సెంచరీకి చేరువలో ఉన్నాడు.
తొలుత టాస్ నెగ్గిన విండీస్.. ఫీల్టిండ్ చెంచుకుంది. ఇంగ్లాడ్ మొదటి ఇన్నింగ్స్ లో నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. గేల్ సూపర్ సెంచరీతో విండీస్ 18.1 ఓవర్లలోనే టార్గెట్ పూర్తిచేసింది.