క్లాష్ ఆఫ్ ది టైటన్స్: కోహ్లి వర్సెస్ గేల్!!
ముంబైలో గురువారం జరుగబోయే భారత్-వెస్టిండీస్ సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అందరి దృష్టి ఆ ఇద్దరిపైనే ఉంది. తన విధ్వంసక ఆటతీరుతో మరోసారి లైవ్‌లైట్‌లోకి రావాలని క్రిస్ గేల్ తపిస్తుండగా.. ఇప్పటికే ఫుల్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లి తన దూకుడును కొనసాగించాలని కృతనిశ్చయంతో ఉన్నాడు. దీంతో సెమీస్ మ్యాచ్‌లో ఈ ఇద్దరి పోరులో ఎవరి ఆధిపత్యం ఉండనుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచేస్తున్నారు.
టీ20 వరల్డ్ కప్‌లో క్రిస్ గేల్ ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే బ్యాటింగ్ చేశాడు. ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా మొదటి మ్యాచ్‌లో సెంచరీ చేసి అబ్బురపరిచిన ఈ బ్యాట్స్‌మన్ ఆ తర్వాత మరో మ్యాచ్‌లో కేవలం నాలుగు పరుగులు చేశాడు. ఇక కోహ్లి స్థిరంగా రాణిస్తూ టోర్నమెంటులోనే బెస్ట్ బ్యాటింగ్ స్టార్‌గా నిలిచాడు. పాకిస్థాన్‌పై అతడు చేసిన అర్ధసెంచరీ, ఆస్ట్రేలియాపై చేసిన 82 పరుగులు భారత్‌కు అద్భుతమైన విజయాలన్నిందిచి అందించి.. సెమీస్‌కు చేర్చాయి. ఇప్పటికే 184 పరుగులు చేసిన కోహ్లి టోర్నమెంటులో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఫ్లాట్ వికెట్ ఉండటంతో పరుగుల వరద ఖాయమని వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వాంఖడే పిచ్‌పై ఈ ఇద్దరి ఎవరి బ్యాటు మోతమోగనుందోనన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే దూకుడు మీద ఉన్న క్రిస్ గేల్ భారత బౌలర్లకు వార్నింగ్ ఇచ్చాడు. ప్రతి బంతిని బాదడమే లక్ష్యంగా బ్యాటింగ్ దిగుతానని, తన జట్టును గెలిపించడమే తన లక్ష్యమని చెప్పాడు. కోహ్లిని ప్రశంసల్లో ముంచెత్తిన గేల్.. అతడు 'వరల్డ్ బెస్ట్ బీటర్' అని కొనియాడాడు. అయితే తమ జట్టు ఏ ఒక్క ఆటగాడి మీద వ్యక్తిగతంగా ఫోకస్ చేయబోదని, అందరినీ దృష్టిలో పెట్టుకుని వ్యూహాలు రచిస్తుందని చెప్పాడు.
ఇరుజట్లకూ గాయాల బెడద!
2007 తొలి టీ20 వరల్డ్ కప్‌ను గెలిచిన ధోనీసేన మరోసారి ఈ మెగా టైటల్‌ను సొంతగడ్డపై అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నది. మరోవైపు ఆఫ్గనిస్థాన్ చేతిలో ఊహించినరీతిలో పరాభవాన్ని ఎదుర్కొన్న వెస్టిండీస్ జట్టు కూడా అప్రమ్తతతోనే సెమీస్ పోరుకు సిద్ధమవుతున్నది. ఇరుజట్లకు గాయాల బెడద వేధిస్తున్నది. ఇప్పటికే గాయం కారణంగా అండ్రూ ఫ్లెచర్ వెస్టిండీస్ జట్టు నుంచి తప్పుకున్నాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో 84 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చిన ఫ్లెచర్ టోర్నమెంటుకు దూరం కావడం వెస్టిండీస్‌కు ఎదురుదెబ్బగా మారింది. అతని స్థానంలో లెండ్లె సిమన్స్ జట్టులోకి వచ్చాడు. ఇటు టీమిండియాను కూడా గాయాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో గాయం కారణంగా యువరాజ్ సింగ్ తప్పుకోవడంతో అతని స్థానంలో మనీష్ పాండే జట్టులోకి వచ్చాడు. తుది జట్టులో యువరాజ్ స్థానాన్ని మనీష్ లేదా అంజిక్యా రహానెలలో ఎవరో ఒకరు భర్తీ చేయనున్నారు. కెప్టెన్ ధోనీ పాండేను జట్టులోకి తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చునని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఈ టోర్నమెంటు మొత్తం రహానె బెంచికే పరిమితమయ్యే అవకాశముంది.