న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితుల్లో భారత జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టలేనని మాజీ సారథి సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. ఆ అవకాశం ఇచ్చినా తీసుకునే పరిస్థితి లేదన్నారు. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో ఉద్యోగం ఇచ్చినా చేయలేను. ఎందుకంటే క్యాబ్ అధ్యక్షుడిగా క్రికెట్‌ను నడిపిస్తున్నా. కాబట్టి ఒకేసారి రెండు పనులను చేయడం సాధ్యం కాదు. ఈ క్షణమైతే కోచ్ పదవికి నో అనే చెబుతాను. క్రికెట్ పరిపాలకుడిగా నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఇక బీసీసీఐకి తదుపరి అధ్యక్షుడి విషయంపై ఏమీ చెప్పలేను. నేను ఇప్పుడిప్పుడే కెరీర్ మొదలుపెట్టా. అది ఎక్కడికి వెళ్తుందో ఎక్కడ ముగుస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి. అలాగని ఏ విషయాన్ని నేను తోసిపుచ్చలేను. అలా చేసుకుంటూ వెళ్లడమే నా ముందున్న పని.
నేను వర్తమానంలో జీవిస్తా. ప్రస్తుత నాకున్న బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తా. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం’ అని దాదా పేర్కొన్నారు. ప్రస్తుతానికి టీమిండియా బాగానే రాణిస్తుందని చెప్పిన సౌరవ్... భవిష్యత్‌లో అవసరమైతే కొత్త కోచ్ ఎంపికపై దృష్టిపెడతామన్నారు. అయితే కొత్త కోచ్ ఎంపికలో క్రికెట్ సలహాదారుల కమిటీ (సీఏసీ) పని చేస్తుందో లేదోనన్నారు. జీవిత చరిత్ర రాసేందుకు సమయం లభించడం లేదని, వృత్తిపరమైన, పరిపాలనపరమైన ఒప్పందాలతోనే రోజంతా గడిచిపోతోందన్నారు. విమర్శలను తీసుకోవడంలో వన్డే కెప్టెన్ ధోని చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నాడని దాదా అన్నారు.
కోచ్‌గా చేసే తీరిక లేదు: గంగూలీ
Published Thu, Feb 4 2016 12:46 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 PM